logo

15 ఏళ్లు దాటితే తుక్కే

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తక్కుగా పరిగణించాలి. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది.

Published : 05 Feb 2023 05:46 IST

ప్రభుత్వ వాహనాలు 308
వ్యక్తిగత, వాణిజ్య సరుకు రవాణావి 1.18లక్షలు

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తక్కుగా పరిగణించాలి. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు సిఫార్సు చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు 308 ఉన్నాయి. ఆర్టీసీతోపాటు ఇతర జీపులు, కార్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయా శాఖలకు జిల్లా రవాణా శాఖ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వీటన్నింటిని త్వరలో తుక్కు పరిశ్రమలకు తరలించనున్నారు. ఇవి కాకుండా ఉమ్మడి జిల్లాలో ప్రైవేటుకు సంబంధించి వ్యక్తిగత, వాణిజ్య వాహనాలన్నీ కలుపుకొని 1.18 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రజారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కాలుష్యాన్ని వెదజల్లే ఈ వాహనాలకు చెక్‌ పెట్టనున్నారు.

ఆర్టీసీ బస్సులు 270 : ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి 15 ఏళ్లు పూర్తయిన వాహనాలు రవాణా శాఖ రికార్డుల్లో 308 ఉన్నాయి. వాటిలో అత్యధికంగా ఆర్టీసీ బస్సులు 270 ఉన్నాయి. ఇతర వాహనాలు 24, కార్లు 9, సరుకు రవాణాకు సంబంధించినవి 5 ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 272 ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ బస్సులు 242, ఇతర వాహనాలు 21, మోటారు కార్లు 7, సరుకు రవాణా 2 ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌లో 18 బస్సులు, 3 ఇతర వాహనాలు, రెండు కార్లు, మూడు సరుకు రవాణా వాహనాలున్నాయి. వనపర్తిలో 6 బస్సులు మాత్రమే ఉన్నట్లు తేలింది. జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 2 చొప్పున ఆర్టీసీ బస్సులు మాత్రమే 15 ఏళ్లు పూర్తయినవి రికార్డుల్లో నమోదై ఉన్నాయి.

* ప్రస్తుత నిబంధనల మేరకు వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల తర్వాత సామర్థ్య పరీక్షలు తప్పనిసరి. వాహనం కండీషన్‌లో ఉంటే అధికారులు పరీక్షలు నిర్వహించి మరో ఐదేళ్లు వాహనం రోడ్డుపై తిరిగేలా అనుమతిస్తారు. వాణిజ్య వాహనాలకు ఏటా సామర్థ్య పరీక్షలు చేపట్టాలి. వ్యక్తిగత వాహనాలు 20 ఏళ్లు, వాణిజ్య వాహనాలను 15 ఏళ్ల తర్వాత తుక్కుగా మార్చాలి. ఏప్రిల్‌ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పాలసీ ప్రకారం పాత వాహనాలను తుక్కుగా మార్చిన తరువాత వాటి యజమానులు కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25 శాతం వరకూ రాయితీ ఇస్తారు.

* కేంద్రం ఆదేశాల మేరకు జిల్లాల్లో గడువు తీరిన వాహనాల జాబితా ప్రకారం ఆయా శాఖలకు నోటీసులు జారీ చేశాం. వాహనాల వివరాలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1.18 లక్షలకుపైగా కాలం చెల్లిన వాహనాలు రెన్యువల్‌ చేసుకొని నడిపిస్తున్నారు. సామర్థ్య పరీక్షల్లో నెగ్గితేనే రోడ్లపై తిరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.

దుర్గాప్రమీల, రవాణాశాఖ ఉప కమిషనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని