logo

అనిశా వలలో తహసీల్దార్‌

ఓ అవినీతి రెవెన్యూ అధికారి పనితీరుకు విసుగు చెందిన రైతు.. అతణ్ని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టించారు. ఈ  ఘటన గుండుమాల్‌ మండల కేంద్రంలో బుధవారం జరిగింది.

Published : 28 Mar 2024 04:11 IST

ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ గుండుమాల్‌ తహసీల్దార్‌ పాండు నాయక్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, ధరణి ఆపరేటర్‌

కోస్గి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : ఓ అవినీతి రెవెన్యూ అధికారి పనితీరుకు విసుగు చెందిన రైతు.. అతణ్ని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టించారు. ఈ  ఘటన గుండుమాల్‌ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ బి.కృష్ణగౌడ్‌ కథనం ప్రకారం.. భోగారం గ్రామానికి చెందిన రైతు పాము మల్లయ్య అదే మండల పరిధిలోని అమ్లికుంట్ల గ్రామానికి చెందిన జైపాల్‌రెడ్డి దగ్గర ఒక ఎకరం భూమి కొనుగోలు చేసి ఈనెల 21న స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని 22న గుండుమాల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. తహసీల్దార్‌ పాండు నాయక్‌ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలు రైతుకు అందజేసే సమయంలో నీ కోసం 2గంటలు అదనంగా పనిచేశాను కాబట్టి రూ.2వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో రైతు నా దగ్గర డబ్బులు లేవు తర్వాత ఇస్తా అని సమాధానం చెప్పగా లేదు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో రైతు రూ.1000లను తహసీల్దార్‌ ఆదేశాల ప్రకారం ధరణి ఆపరేటర్‌ రవీందర్‌రెడ్డికి ఫోన్‌పే ద్వారా చెల్లించారు. సదరు రైతు తర్వాత రోజు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి మరో భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలు ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరగా నిన్ననే డబ్బులు తక్కువగా ఇచ్చావు.. మరో రూ.2వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం గుండుమాల్‌ తహసీల్దార్‌కు రూ.2వేలు ఇవ్వడానికి వెళ్లగా రికార్డ్‌ అసిస్టెంట్‌ మొగులప్పకు ఇవ్వాలని సూచించడంతో రైతు డబ్బులను ఇచ్చాడు. రైతు కార్యాలయం నుంచి బయటకు వచ్చి తర్వాత మేము కార్యాలయంలోకి వెళ్లి తహసీల్దార్‌ నుంచి రూ.2వేలు రికవరీ చేసి అనంతరం హైదరాబాదులోని ఏసీబీ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తామని అనిశా అధికారి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని