logo

మహిళా సంఘాలకే ఎక్కువ కేంద్రాలు

ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం పౌరసరఫరాల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే అధికంగా కేటాయించారు.

Published : 28 Mar 2024 04:22 IST

ధాన్యం కొనుగోలులో పారదర్శకతకు చర్యలు

కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం పౌరసరఫరాల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే అధికంగా కేటాయించారు. మూడు, నాలుగేళ్లుగా పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో అధికంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించారు. గత సీజన్‌లో 170 కేంద్రాల వరకు పీఏసీఎస్‌ల ద్వారానే కొనుగోలు చేశారు. వాటి ద్వారా కొనుగోళ్లు చేయటం వల్ల అనేక సమస్యలు వచ్చాయని, కొన్ని చోట్ల ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై ప్రారంభంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేటలో సమీక్షలు చేశారు. పీఏసీఎస్‌లు నిర్వహించే కొనుగోలు కేంద్రాలను ఇతరులకు అప్పగించాలని సూచించారు. దీంతో ఈ ఏడాది మహిళా సంఘాలకు అప్పజెప్పారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉన్న 202 కేంద్రాల్లో 178 కేంద్రాలను మహిళా సంఘాలకే అప్పగించారు. కొనుగోలు కేంద్రాలు ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం పక్కదారి పట్టడం, రైతుల నుంచి కాకుండా వ్యాపారుల నుంచి కొనుగోలు చేయడం వంటి సంఘటనలు గతంలో జరిగాయి. వాటిని సమీక్షిస్తూ ఈ సారి అలాంటి సంఘటనలు జరుగకుండా పీఏసీఎస్‌లను మార్చాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ కలెక్టరేట్‌లో వరి కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. రైతులకు ఎలాంటి సమస్యలు రావొద్దని సూచించారు.

గన్నీ సంచుల్లో అవకతవకలు అరికడితేనే..

ఏటా గన్నీ సంచుల విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నా.. చర్యలు చేపట్టడం లేదు. రెండేళ్లుగా గన్నీ సంచుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయి. పీఏసీఎస్‌లకు ఇచ్చిన సంచుల్లో తిరిగి వచ్చే సరికి వేల సంఖ్యలో సంచుల సంఖ్య తగ్గుతోంది. వ్యాపారులకు అధికంగా వెళ్లాయనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఈసారి కొనుగోలు కేంద్రాల వద్దనే గన్నీ సంచులను రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. రైతులకు కాకుండా ఇతరులకు ఇవ్వవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. 2.26 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారులు అంచనా వేశారు. ఏప్రిల్‌ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ బాలరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న గన్నీ సంచులు సరిపోతాయి. వచ్చే కొనుగోలుకు వచ్చే ధాన్యాన్ని బట్టి గన్నీ సంచులు సిద్ధం చేస్తాం.

ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి 23,72,500
ఈ రబీ సీజన్‌లో అవసరమయ్యే గన్నీ సంచులు 55,54,500

కొనుగోలు కేంద్రాలు..

మహిళా సంఘాల ద్వారా 178
పీఏసీఎస్‌ల ద్వారా 20
మెప్మా ద్వారా 04
మొత్తం కేంద్రాలు 202

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని