logo

శ్రీరామ నవమికి శిర్సనగండ్ల ముస్తాబు

రెండో భద్రాదిగా పేరుగాంచిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీరాములోరి కల్యాణం, బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని శోభాయమానంగా ముస్తాబు చేశారు.

Published : 16 Apr 2024 03:07 IST

విద్యుద్దీపాలంకరణలో శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం

  • చారకొండ (వెల్దండ గ్రామీణం), న్యూస్‌టుడే : రెండో భద్రాదిగా పేరుగాంచిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీరాములోరి కల్యాణం, బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని శోభాయమానంగా ముస్తాబు చేశారు. మంగళవారం శ్రీసీతారాముల మాసకల్యాణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఈనెల 30 వరకు జరుగనున్నాయి. ఈనెల 17న నిర్వహించనున్న శ్రీసీతారాముల మహా కల్యాణోత్సవం, 18న రాత్రి చిన్నతేరు, 20న రాత్రి పెద్ద రథోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్త జనం తరలిరానుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ ఛైర్మన్‌ ఢేరం రామశర్మ పేర్కొన్నారు. విద్యుద్దీపాలంకరణ, తాగునీరు, గుట్ట పైకి ఉన్న దారి మరమ్మతులు, ప్రత్యేక పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. ఎండవేడిమి నుంచి భక్తులు ఉపశమనం పొందేందుకు చలువ పందిళ్లు, వైద్య శిబిరం, ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక లైన్ల ఏర్పాట్లను సిద్ధం చేశారు. వివిధ బస్సు డిపోల నుంచి వచ్చే బస్సుల రాకపోకల కోసం అయోధ్యనగర్‌లో ప్రత్యేక బస్టాండ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు గుట్టపైకి భక్తులు వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాలతో పాటు జాతర మైదానంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చారకొండ ఠాణాకు అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ నిరంజన్‌, అర్చకులు లక్ష్మణశర్మ, మురళీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని