logo

805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు.

Published : 19 Apr 2024 05:44 IST

కృష్ణా నదిలో శ్రీశైలం తిరుగుజలాల ఆధారంగా నిర్ణయం

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే : కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. ఉన్నతాధికారుల నుంచి మిషన్‌ భగీరథ పథకం నిర్వహణ అధికారులకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఈ మేరకు ఈ నెల 15న పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు తీరంలో కోతిగుండు, రేగుమాన్‌గడ్డ ప్రాంతాల్లో శ్రీశైలం తిరుగుజలాల నీటి నిల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల కలెక్టర్లు, భగీరథ జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆయన సూచనలకనుగుణంగా ఈ వేసవిలో ఏప్రిల్‌ నెల నుంచి మే, జూన్‌, జులై నెలలో తాగునీటి సమస్య అధిగమించే విధంగా భగీరథ అధికారులు చర్యలు చేపట్టబోతున్నారు.

నీటి నిల్వలే ప్రధానం.. : మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ) ప్రాజెక్టులో ఎల్లూరు రేగుమాన్‌గడ్డ తీరంలో నిల్వ ఉన్న శ్రీశైలం తిరుగుజలాలను ప్రస్తుతం మోటార్లతో ఎత్తిపోసి ఎల్లూరు జలాశయాన్ని నింపుతున్నారు. ఈ జలాశయం సామర్థ్యం 0.35 టీఎంసీలు. ప్రాజెక్టులో 1, 2, 4వ మోటారు ద్వారా నీటి ఎత్తిపోత కొనసాగుతోంది. 809 అడుగుల నీటినిల్వలో 804 అడుగుల మేర నీళ్లు నిల్వ ఉన్నంత వరకు మోటార్లతో ఎత్తిపోత చేసుకోవచ్చు. అందుకే 805 అడుగుల నీటి నిల్వ వచ్చిన వెంటనే ముందస్తుగా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు మిషన్‌ భగీరథ పథకం ఈఈ సుధాకర్‌సింగ్‌ చెప్పారు. ఆ విధంగానే తాము ఏర్పాట్లు చేసుకుంటున్నామన్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీలు, పురపాలికలలో ఉన్న తాగునీటి వనరులకు మరమ్మతులు, నీళ్లు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు చెప్పామన్నారు. నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. గతంలోనే రేగుమాన్‌గడ్డ తీరంలో నీటి నిల్వలు వెనక్కి వెళ్లకుండా కొంతవరకు అడ్డుకట్ట వేశామన్నారు. ఎల్లూరు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గ్రామాలు, పట్టణాలకు లక్ష్యంమేర తాగునీటి సరఫరా చేస్తున్నట్లు ఈఈ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని