logo

ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ

తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 04:04 IST

మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, వేదికపై మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆప్సర్‌ పాషా, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాలులో మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మైనార్టీ మహిళల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. భాజపా ప్రజల పార్టీయే గానీ మత పార్టీ ఎంతమాత్రం కాదన్నారు. ప్రధాని మోదీ అన్ని మతాలు, విశ్వాసాలను గౌరవించే నేతని, మహిళల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ముస్లిం మహిళల సమస్యలు గమనించే మోదీ ముమ్మారు తలాక్‌ను రద్దు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీలను ఓటుబ్యాంకుగా వాడుకుందే తప్ప వారి సంక్షేమంపై ఏమాత్రం దృష్టి సారించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తోందని, ఎలాంటి హింసకు తావు లేకుండా ఆర్టికల్‌-370 రద్దు చేసి కశ్మీర్‌ను దేశంలో అంతర్భాగం చేశారని తెలిపారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని మైనార్టీలంతా మతాలకు అతీతంగా దేశం, పిల్లల భవిష్యత్తు కోసం భాజపాకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌ పాషా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, భారాస నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవొద్దని, భాజపాకు అండగా నిలవాలని కోరారు. సమ్మేళనానికి ముందు మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో న్యూటౌన్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా, అశోక్‌ టాకీస్‌ చౌరస్తా మీదుగా ఆల్మాస్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు ముస్లీం మహిళలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యూసుఫ్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు రహేదా గౌసియా తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని