logo

విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రగతి పత్రాలు

ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రగతి పత్రాలు అందజేశారు.

Published : 24 Apr 2024 06:29 IST

వెల్దండ: విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలను అందజేస్తున్న ఉపాధ్యాయుడు

అచ్చంపేట, న్యూస్‌టుడే : ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రగతి పత్రాలు అందజేశారు. ఈ నెల 22న సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్‌ఏ)-2 పరీక్షలు ముగిశాయి. విద్యార్థుల మార్కులు, హాజరు తదితర వివరాలతో ప్రగతి పత్రాలు అందజేసేందుకు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి ప్రగతి పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. చివరి పనిదినమైన మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని వివరించి ఆ తరువాత ప్రగతి పత్రాలు అందజేశారు. వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సమావేశంలో వివరించారు. ఈ నెల 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్‌ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల ప్రగతిని తెలిపే ప్రోగ్రెస్‌ కార్డుల (ప్రగతి పత్రాలు) పంపిణీ కరోనా నాటినుంచి నిలిచి పోయింది. గతేడాది నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రగతి పత్రాలు అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఇప్పటికే నిర్మాణాత్మక (ఎఫ్‌ఏ-1, 2, 3, 4), ఎస్‌ఏ-1 పరీక్షల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం ఎస్‌ఏ-2 వివరాల నమోదు పూర్తి చేసి ప్రగతి పత్రాలను డౌన్‌లోడ్‌ చేసి విద్యార్థులకు అందజేశారు.

తల్లిదండ్రులకూ అవగాహన.. : ప్రతి విద్యార్థికి ఆన్‌లైన్‌ ప్రగతి పత్రాలు అందజేయడంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత హెచ్‌ఎంలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. వేసవి సెలవుల్లో విద్యార్థులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా తల్లిదండ్రుల సమావేశాల్లో అవగాహన కల్పిస్తున్నాం..

డా.గోవిందరాజులు, డీఈవో, నాగర్‌కర్నూల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని