logo

పేదోళ్లు ఇంటర్‌ చదవద్దా?

ఉమ్మడి పాలమూరులో వెనకబడిన జిల్లా నారాయణపేట. కార్మికులు, వలస కూలీల జిల్లాగా పేరుంది.

Updated : 30 Apr 2024 06:36 IST

కళాశాలలు లేక అవస్థలు 
పడకేసిన ప్రతిపాదనలు

న్యూస్‌టుడే, నారాయణపేట పట్టణం : ఉమ్మడి పాలమూరులో వెనకబడిన జిల్లా నారాయణపేట. కార్మికులు, వలస కూలీల జిల్లాగా పేరుంది. విద్యారంగంలోనూ వెనుకబడి ఉంది. 2019లో కృష్ణా, మరికల్‌ కొత్త మండలాలుగా ప్రకటిస్తూ 11 మండలాలతో 32వ జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ తరువాత కొత్తపల్లి, గుండుమాల్‌ ఏర్పాటు చేయడంతో జిల్లాలో మొత్తం 13 మండలాలు అయ్యాయి.  మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం కోస్గి, మద్దూరు, దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, ఊట్కూరు, మక్తల్‌, మాగనూరుల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. నర్వ, కృష్ణా, మరికల్‌తోపాటు కొత్త మండలాలైన గుండుమాల్‌, కొత్తపల్లిల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు లేవు. నారాయణపేటలో బాలికల జూనియర్‌ కళాశాలతోపాటు మరికల్‌, నర్వల్లో కాలేజీల కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉండి విద్యాసౌకర్యం లేక అనేకమంది పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడం, సరైన రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొందరు విద్యార్థులు పదిలో మంచి మార్కులు సాధించినా చదువుకోలేక వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు.  వసతిగృహాల్లో సీటు రాని వారి పరిస్థితి దయనీయంగా ఉంది.  

మచ్చుకు ఓ ఉదాహరణ: జిల్లా కేంద్రానికి నర్వ 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మక్తల్‌ 25 కి.మీ, ఆత్మకూర్‌ 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు రవాణా ఖర్చులు భరించి వెళ్లివస్తున్నారు.  బీదాబిక్కీ పిల్లలు కూలీలుగా మారుతున్నారు. అత్యధిక మార్కులు సాధించే అమ్మాయిలకు సైతం పెళ్లిల్లు చేసి అత్తరింటికి సాగనంపుతున్నారు. ఇరవైఏళ్లుగా నర్వలో కాలేజీ కోసం ఆందోళనలు జరగుతున్నాయి. కళాశాల సాధన కమిటిని ఏర్పాటు చేసి ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నేటికీ  నేరవేరలేదు.  కాలేజీ కోసం అప్పట్లో సర్పంచి స్వాతిలక్ష్మీకాంత్‌రెడ్డి రెండెకరాల స్థలం ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయినా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు.  

ఈ స్కూళ్ల పిల్లలు ఏమవ్వాలి?: జిల్లాలో జూనియర్‌ కళాశాల లేని మండలాల్లో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలు సరిపడా ఉన్నాయి. అ్కడి నుంచి ఎంతోమంది ప్రతిభావంతులు తయారవుతున్నారు. వీరందరూ పదోతరగతి పూర్తయ్యాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నర్వ : నర్వ, పెద్దకడుముర్‌, పాతర్‌చేడ్‌, ఉందేకోడ్‌, కల్వాల్‌ల్లో ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
మరికల్‌ : మరికల్‌లో బాలురు, బాలికలు, ఉర్దూ హైస్కూళ్లు ఉన్నాయి. పెద్దచింతకుంట, కన్మనూర్‌ల్లోనూ హైస్కూళ్లు ఉన్నాయి.
కృష్ణా : కృష్ణా, గుడేబల్లూర్‌, ముడుమాల్‌ గ్రామాల్లో జడ్పీ ఉన్నతపాఠశాలలు ఉన్నాయి.
గుండుమాల్‌ : గుండుమాల్‌, కొమ్మూరు, కొత్తపల్లి మండలంలె భూనీడ్‌, నిడ్జింతల్లో హైస్కూళ్లు ఉన్నాయి.


చదువుకు దూరమయ్యాను: మాది పెద్దకడ్మూర్‌. మా ఊళ్లోనే పదోతరగతి వరకు చదివి ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్‌ చదువుకోవాలని ఆశ ఉన్నా దగ్గరలో కాలేజీ లేదు. ప్రైవేటులో చదువుకునే స్థోమత లేదు.కూలిచేసుకుని డబ్బులు దాచుకుని చదువుకుందామన్నా కనీసం ప్రైవేటు కళాశాల కూడా లేదు. వ్యవసాయం చేసుకుంటున్నాను. నాలాంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు.

 మహేశ్‌, పెద్దకడ్మూర్‌, నర్వ మండలం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని