logo

వనిత..కలత!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక ఓటర్లు అతివలే. పురుష ఓటర్ల కంటే వారు 1,13,920 మంది ఎక్కువగా ఉన్నారు.

Updated : 30 Apr 2024 06:35 IST

సగానికి పైగా ఓటర్లున్నా లోక్‌సభలో దక్కని ప్రాతినిధ్యం 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక ఓటర్లు అతివలే. పురుష ఓటర్ల కంటే వారు 1,13,920 మంది ఎక్కువగా ఉన్నారు. ఏ ఎన్నిక జరిగినా గెలుపోటములను ప్రభావితం చేసేది కూడా వారే. అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచినా ఇప్పటివరకు ఎంపీలు మాత్రం కాలేకపోయారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే, చట్టాలు రూపొందించే ప్రజాస్వామ్య మందిరం పార్లమెంట్‌లో ఇక్కడి అతివలు అడుగు పెట్టలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటికి 1952 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇక్కడి రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసిన మహిళలు కూడా కొందరే కావటం గమనార్హం.

 న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ గ్రామీణం, ధరూరు

డీకే అరుణ

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు పోటీచేసిన మహిళ డీకే అరుణ మాత్రమే. మంత్రిగా పనిచేసి, రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన మహిళా నేతగా పేరు సంపాదించిన ఆమె 1995లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1996లో తెదేపా ఆమెకు మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్‌ అభ్యర్థి డా.మల్లికార్జున్‌ చేతిలో 3,700 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. తర్వాత నడిగడ్డ రాజకీయాలపై దృష్టిసారించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ రాకపోవటంతో ఆ పార్టీని వదిలిన డీకే అరుణ భాజపా తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. డీకే అరుణకు మొత్తం 3,33,121 ఓట్లురాగా రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో ముగ్గురు సరోజనమ్మ, గోవిందమ్మ, విజయ పోటీలో ఉన్నారు.

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానంలో ఇప్పటివరకు ప్రధాన పార్టీల తరఫున ఇద్దరే మహిళలు పోటీ చేశారు. తెదేపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన ఇందిరకు 1985లో ఎన్టీఆర్‌ షాద్‌నగర్‌ అసెంబ్లీ టికెట్‌ ఇవ్వగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లోనూ తెదేపా నుంచి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. తర్వాత తెదేపాను వీడిన ఇందిర లక్ష్మీపార్వతి పెట్టిన ఎన్టీఆర్‌ తెదేపాలో చేరారు. ఇందిరకు నాగర్‌కర్నూల్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వగా 1996లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2004లో బీఎస్పీ తరఫున రాణి రత్నమాల పోటీ చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత 2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా బంగారు శృతి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 1,29,021 ఓట్లతో ఆమె మూడో స్థానంలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కొల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన బర్రెలక్క (శిరీష) లోక్‌సభ ఎన్నికల బరిలోనూ నిలిచారు. దాసరి భారతి, గీత పోటీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని