logo

ఫలానావారి కుమార్తెలు 30లక్షల మంది

1951లో తొలిసారి ఓటరు నమోదు చేపట్టారు. అప్పట్లో ఆచారాలు, సంప్రదాయాల కారణంగా మహిళలు తమ పేరుతో పాటు భర్త పేరు చెప్పేందుకు నిరాకరించారు.

Published : 05 May 2024 02:12 IST

1951లో తొలిసారి ఓటరు నమోదు చేపట్టారు. అప్పట్లో ఆచారాలు, సంప్రదాయాల కారణంగా మహిళలు తమ పేరుతో పాటు భర్త పేరు చెప్పేందుకు నిరాకరించారు. కొందరు తండ్రి పేరు మాత్రమే చెప్పడంతో ఎన్నికల సిబ్బంది విధిలేని పరిస్థితుల్లో ఫలానా వారి కుమార్తెగా ఓటర్ల జాబితాలో వివరాలు నమోదు చేసుకున్నారు. ఓటర్ల పేర్లు లేకుండా కేవలం తండ్రుల పేరుతో దేశంలో 30 లక్షల వరకు ఓటర్ల జాబితాలో నమోదు చేశారు. ఈ జాబితాలను పరిశీలించిన ఎన్నికల సంఘం పేరు, భర్త పేరు లేకుండా కేవలం ఫలానా వారి కుమార్తె అని నమోదు చేసిన ఓటర్లందరినీ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించడంతో ఓటు హక్కు కోల్పోవాల్సి వచ్చింది.

న్యూస్‌టుడే, అచ్చంపేట


ద్వితీయశ్రేణి.. హడావుడి ఏదీ?

రాజోలి, న్యూస్‌టుడే : అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నాయకుల హడావుడి అంతా ఇంతా కాదు. అభ్యర్థి రాకపోయినా, ప్రతి రోజూ ఇంటింటికీ తిరుగుతూ.. కార్యకర్తలను పోగు చేస్తూ.. వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ.. ప్రచారం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అలాంటి హడావుడి ఏమీ కనిపించడం లేదు. ఒకటి, రెండు చోట్ల మినహాయిస్తే.. ద్వితీయ శ్రేణి నాయకులు గుంబనం వీడటం లేదు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నా కార్యకర్తల్లో ఉత్తేజం, ఉత్సాహం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు నెలలకే ఈ ఎన్నికలు రావడంతో స్తబ్దత నెలకొన్నట్లు కన్పిస్తోంది.

నిరాసక్తి: ఆర్థిక భారం ఎక్కడ మీదపడుతుందోననే ఉద్దేశంతో కొందరు నాయకులు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే ద్వితీయ శ్రేణి నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ముఖ్య నాయకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది. ఒక వేళ ఎవరైనా ఖర్చు చేసి, పార్టీ గెలుపునకు కృషి చేసినా, పార్లమెంట్‌ నియోజకవర్గం కావడంతో గెలిచిన అభ్యర్థి మమ్మల్ని గుర్తించుకుంటాడా? అనే సందిగ్ధం కూడా ద్వితీయశ్రేణి నాయకుల్లో నెలకొంది. ఫలితంగా వారి హడావుడి కనిపించడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని