logo

రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మురుగన్‌

ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్‌ రాద్ధాంతం చేస్తోందని ఎట్టి పరిస్థితులలోను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి మురుగన్‌ తేల్చి చెప్పారు.

Updated : 05 May 2024 06:49 IST

అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి మురుగన్‌, డీకే అరుణ, పోతుగంటి భరత్‌ ప్రసాద్‌, రాములు తదితరులు

గద్వాల కలెక్టరేట్‌, అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్‌ రాద్ధాంతం చేస్తోందని ఎట్టి పరిస్థితులలోను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి మురుగన్‌ తేల్చి చెప్పారు. మత పరమైన రిజర్వేషన్‌లకు భాజపా వ్యతిరేకం కానీ, రాజ్యాంగం పేద వర్గాలకు ప్రసాదించిన రిజర్వేషన్‌లను   కాదన్నారు. శనివారం గద్వాలలోని తేరుమైదానంలో భాజపా జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి మురుగన్‌, జాతీయ నాయకురాలు డీకే అరుణ. ఎంపీ రాములు, ఎంపీ అభ్యర్థి భరత్‌ప్రసాద్‌ హాజరయ్యారు. లోకసభ ఎన్నికల్లో భాజపాపై ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డి, స్టాలిన్‌లు ప్రధానులు కాలేరని, నరేంద్రమోదీ మాత్రమే ప్రధాన మంత్రి అవుతారని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో కేసీఆర్‌ హయాంలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదని, స్కాంల్లో అభివృద్ధి చెంది ఆయన కూతురు కవిత జైలు జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి అడ్రస్‌లేదని... రాహుల్‌ ప్రధాని కాలేరని, రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు కావనీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచార సభలలో సీఎం రేవంత్‌రెడ్డి ముస్లిం ప్రజలలో సానుభూతి సంపాదించడం కోసం తహతహలాడుతున్నారని ఆరోపించారు. నాగర్‌ కర్నూల్‌ భాజపా ఎంపీ అభ్యర్థి భరత్‌ను గెలిపించాలని కోరారు.

దేశానికి దిశా దశ మోదీనే: దేశానికి దిశా..దశ ప్రధాని నరేంద్రమోదీనేనని నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు పేర్కొన్నారు. కాంగ్రెస్‌, భారాస పార్టీ ఎత్తుగడలు సాగవని, వారెన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు ఆదరించే స్థితిలో లేరన్నారు. ఎంపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ మోదీ ప్రభంజనం ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. ఉమ్మడి జిల్లాలో తనను, డీకే అరుణను ఆశీర్వదించి లోక్‌సభకు పంపాలన్నారు. యువకులకు స్థానం కల్పించాలన్న సంకల్పంతోనే మోదీ తనకు అవకాశం ఇచ్చారన్నారు. జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి అశోక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సభకు హాజరైన కార్యకర్తలు, ప్రజలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని