logo

ఎన్నికల్లోనే వినిపించే రైల్వేకూత

నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో రైల్వే లైను కోసం నలభై ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలు గడిచినా ఆ కల నేరవేరటం లేదు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కృష్ణా-వికారాబాద్‌ రైల్వే లైను ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది.

Published : 06 May 2024 05:15 IST

అభ్యర్థిగా ఉన్నప్పుడు అంటారు
గెలిచాక ముఖం చాటేస్తారు

అభివృద్ధికి నోచని కృష్ణా రైల్వేస్టేషన్‌

న్యూస్‌టుడే, నాగర్‌కర్నూల్‌, ధరూరు: నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో రైల్వే లైను కోసం నలభై ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలు గడిచినా ఆ కల నేరవేరటం లేదు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కృష్ణా-వికారాబాద్‌ రైల్వే లైను ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రతి ఎన్నికలలో రైల్వేలైను అనేది హామీగానే మిగులుతోంది. ఎంపీలుగా గెలిచిన వారు వీటిపై ప్రత్యేక దృష్టి సారించటం లేదు. రైలుమార్గం లేకపోవడంతోనే ఈ ప్రాంతం వెనకబడిందనే అభిప్రాయం బలంగా ఉంది. వందేళ్ల క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లాగా ఉన్నప్పుడు ఇక్కడికి రావడానికి ప్రత్యేకంగా రైలు లేదనే నేపంతోనే జిల్లాను పాలమూరుకు మార్చారనే అభిప్రాయం ఉంది. రైల్వే లైను కోసం మూడు దశాబ్దాలుగా పోరాట సమితి తరఫున డిమాండ్లు చేస్తున్నారు. ఇక్కడ బలమైన నాయకులు లేకపోవడం, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడటంతో రైలు మార్గం అనేది వెనక్కి వెళ్తోంది.  ఇతర ప్రాంతాలను కలుపుతూ రైలు మార్గం ఉంటే పారిశ్రామికంగా, రవాణాపరంగా ఉపయోగకరం. ఇక్కడి ప్రసిద్దిగాంచిన కొల్లాపూర్‌ మామిడి పండ్లను ఇతర ప్రాంతాలకు సులువుగా ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది.  ఎన్నికల సమయంలో  ఇప్పుడు మళ్లీ ఈ లైను గురించి నాయకులు ప్రస్తావిస్తున్నారు.

ప్రతిపాదనలకే పరిమితం

నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల మీదుగా వెళ్లేలా గద్వాల-మాచర్ల రైల్వే లైను ప్రతిపాదనలో ఉంది.  1980 నుంచి దీనిపై చర్చ సాగుతోంది. ఈ లైను కోసం అనేక సార్లు పోరాటాలు జరిగాయి. ఒక్క సారి సర్వే చేశారు. ఈ లైను ద్వారా రాబడి తక్కువగా ఉంటుందని సర్వే చేసి పక్కన పెట్టారు. దీంతో మళ్లీ మొదటికి వచ్చింది. సర్వే స్థాయి దాటలేదు. ప్రస్తుతం గద్వాల - డోర్నకల్‌ లైను తెరపైకి వచ్చింది.  ఇది గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, దేవరకొండ మీదుగా డోర్నకల్‌కు 290 కిలోమీటర్లు వెళ్లేలా ప్రతిపాదించారు. ఈ లైను కోసం సర్వే చేయాలని కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం సర్వే దశలోనే ఉంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేది స్పష్టత లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషిచేస్తేనే సాధ్యమవుతుంది.

కృష్ణా-వికారాబాద్‌ అంతేనా?

మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని నారాయణపేట, మక్తల్‌, కొడంగల్‌, కోస్గి ప్రాంతాలకు రైల్వేసౌకర్యం నామమాత్రం అని చెప్పాలి. రెండు దశబ్దాల క్రితం కృష్ణా- వికారాబాద్‌ రైల్వే లైను ప్రతిపాదనలు పంపించారు.   రెండు సార్లు సర్వే చేశారు. కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. కానీ అమల్లోకి రాలేదు. పనులు చేసేందుకు నిధులు మంజూరు కాలేదు. పరిగి, కొడంగల్‌, నారాయణపేట, దౌల్తాబాద్‌ మీదుగా వెళ్లే విధంగా కృష్ణా-వికరాబాద్‌ రైల్వైలైను డిజైన్‌ చేశారు. ప్రతి ఎన్నికల్లో నినాదంగానే మిగిలిపోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని