logo

ప్రయాణ ప్రాంగణాల్లో జన జాతర

పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాక చిన్నా.. పెద్దా లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఆర్టీసీ ఉగాది ఛాలెంజ్‌ పేరిట ప్రతి స్టేజీ వద్ద బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అందుకు తగ్గట్లు బహుమతులు కూడా ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 06 May 2024 05:20 IST

వేసవిలో ఆర్టీసీకి రోజూ 110 శాతానికి పైగా ఓఆర్‌

మహబూబ్‌నగర్‌ : హైదరాబాద్‌ ప్లాట్‌ఫాంపై కిక్కిరిసిన ప్రయాణికులు

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాక చిన్నా.. పెద్దా లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఆర్టీసీ ఉగాది ఛాలెంజ్‌ పేరిట ప్రతి స్టేజీ వద్ద బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అందుకు తగ్గట్లు బహుమతులు కూడా ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏ మార్గంలో చూసినా బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్నాయి. పల్లె వెలుగు మొదలుకొని ఎక్స్‌ప్రెస్‌ బస్సులు కూడా 100 శాతానికి పైగా నిండి వెళ్తున్నాయి. మరోపక్క ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు బస్సుల్లో ‘0’ టికెట్‌తో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించటంతో బస్టాండ్లలో ప్రయాణికులతో జన జాతర నెలకొంది.

ప్రయాణికులకు తప్పని నిరీక్షణ : మహబూబ్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూల్‌, గద్వాల, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, కొల్లాపూర్‌ నుంచి హైదరాబాద్‌ నగరానికి ప్రతి బస్సు నిండుకుండలా వెళ్తోంది. మహబూబ్‌నగర్‌ బస్టాండులో ఎప్పుడు చూసినా నాలుగైదు బస్సులకు సరిపడా ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ప్రయాణికుల రద్దీ బస్టాండ్లలో ఒక్కసారిగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టు బస్సులు లేకపోవడంతో అరగంటకు పైగా నిరీక్షించాల్సి వస్తోంది. మహబూబ్‌నగర్‌ బస్టాండు మీదుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు నారాయణపేట, రాయచూరు, ఆత్మకూరు నుంచి ప్రతి పది నిమిషాలకో బస్సు, మహబూబ్‌నగర్‌ డిపో నుంచి ప్రతి అరగంటకో బస్సున్నా ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దూర ప్రాంతాల బస్సులు కూడా నిండుగా వస్తున్నాయి. సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు. రద్దీ మేరకు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

110 శాతానికి తగ్గని ఓఆర్‌ : ‘మహాలక్ష్మి’ పథకం ప్రవేశం పెట్టక ముందు మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌లో ఓఆర్‌ 72 శాతం మాత్రమే నమోదయ్యేది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాక 90 శాతం వరకు ఓఆర్‌ వచ్చింది. వేసవి సెలవులు ప్రారంభమయ్యాక ఏప్రిల్‌ నుంచి ఓఆర్‌ 110కి ఏమాత్రం తగ్గడం లేదు.

త్వరలో కొత్త బస్సులు..

రీజియన్‌లో వేసవి నేపథ్యంలో రద్దీ బాగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ మేరకు ఆయా మార్గాల్లో బస్సులు నడుపుతున్నాం. ఓఆర్‌ ప్రస్తుతం 100 శాతం దాటుతోంది. కొత్త బస్సుల కోసం ప్రతిపాదించాం. త్వరలో రానున్నాయి. డిపోల వారీగా బస్సులు కేటాయిస్తాం.

వి.శ్రీదేవి, ఆర్టీసీ ఆర్‌ఎం, మహబూబ్‌నగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని