logo

సీఎంఆర్‌ బియ్యం సమకూరేనా?

మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్‌ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు.

Published : 07 May 2024 02:56 IST

పెబ్బేరు, న్యూస్‌టుడే : మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్‌ ధాన్యాన్ని మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యానికి ప్రభుత్వం ఎన్నో సార్లు గడువు పెంచినా.. వారిలో మాత్రం చలనం రావడం లేదు. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ బియ్యం భారీగా పెండింగ్‌ ఉండటంతో నూటికి 125 శాతం జరిమానా విధిస్తూ ప్రభుత్వం మరో రెండు నెలల గడువు పెంచింది. ఇటీవల ఉత్తర్వులు జిల్లాల కలెక్టర్లకు వచ్చాయి. మిల్లర్లకు కేటాయించిన వరి ధాన్యంలో క్వింటాకు 67 కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వానికి తిరిగివ్వాలి. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 66,700 మెట్రిక్‌ టన్నులు (2,300 ఏసీకేలు) బియ్యం ఇవ్వాల్సి ఉంది. నూటికి 125 శాతం జరిమానా విధించడంతో అదనంగా సుమారు 17 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లర్ల యజమానులు ఇవ్వాల్సి ఉంది. లేకుంటే రెండు నెలల అనంతరం రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం ఆస్తులు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇతర రాష్ట్రాలకు తరలించడంతోనే..

నాలుగేళ్లుగా ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్‌ ధాన్యం యజమానులు అక్రమార్జన కోసం ఇతర రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. తనిఖీలు, దాడులు చేసే అధికారులు నిర్లిప్తంగా ఉండటంతో ధాన్యం రాష్ట్రం దాటిపోయింది. సుమారు 40 శాతం ధాన్యం పక్క రాష్ట్రాలకు తరలిపోగా.. ఆలస్యంగా మేలుకొన్న అధికార యంత్రాగం, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొన్ని నెలల క్రితం మిల్లులపై దాడులు చేశారు. వనపర్తి జిల్లాలోనే 5 లక్షల సీఎంఆర్‌ ధాన్యం బస్తాలు మాయమైనట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడిన మిలర్లపై నామమాత్రంగా చర్యలు తీసుకుని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని సార్లు గడువు పెంచినా.. మిల్లర్ల వద్ద ధాన్యమే లేకపోతే ప్రభుత్వానికి ఎలా ఇస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ నాయకులతో చర్చలు?

వనపర్తి జిల్లాలో 139 రా మిల్లులు, 12 బాయిల్డ్‌ మిల్లులు ఉన్నాయి. వీటిలో 80 మిల్లులు ప్రభుత్వానికి సీఎంఆర్‌ బియ్యం ఇవ్వకపోవడంతో డిఫాల్ట్‌ కింద చేర్చారు. ఈ మిల్లుల నుంచి 2020 నుంచి ఇప్పటి వరకు 2,300 ఏసీకేల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో బియ్యం పెండింగ్‌లో ఉంటే మిల్లర్ల యజమానులపై చర్యలు తీసుకోవడంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ 80 మిల్లులకు యాసంగిలో వరి ధాన్యం కూడా కేటాయించలేదు. కేవలం 14 బియ్యం మిల్లులకు మాత్రమే అవకాశమిచ్చారు. చర్యలు చేపట్టకుండా మిలర్ల యజమానులు రాజకీయ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.


రెండు నెలల్లో ఇవ్వకుంటే ఆస్తుల జప్తు

- బాలు నాయక్‌, పౌరసరఫరాల సంస్థ అదనపు డీఎం, వనపర్తి

బకాయిలో ఉన్న సీఎంఆర్‌ బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లకు ప్రభుత్వం రెండు నెలల అవకాశం ఇచ్చింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యంలో నూటికి 125 శాతం జరిమానాతో వసూలు చేస్తాం. అలా ఇవ్వని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం మిల్లు యజమాని, మిల్లుకు జామీను ఉన్న వారి ఆస్తులను జప్తు చేస్తాం. ప్రభుత్వ నింబంధనల ప్రకారం మిల్లర్లు నడుచుకోవాలి. లేకుంటే చర్యలు తప్పవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని