logo

ఇక్కడ ‘అధ్యక్ష’.. అక్కడ ‘మహోదయ్‌!’

రాష్ట్రంలో అసెంబ్లీ, కేంద్రంలో పార్లమెంట్‌ చట్టసభలు. ఈ రెండు సభల్లోనూ అడుగుపెట్టారు కొందరు నేతలు. అసెంబ్లీలో అధ్యక్షా అని, పార్లమెంట్‌లో సభాధ్యక్ష మహోదయ్‌ అంటూ పాలమూరు వాణి వినిపించారు.

Published : 09 May 2024 06:01 IST

రెండు చట్టసభల్లో పాలమూరు వాణి
ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచిన నేతలు

రాష్ట్రంలో అసెంబ్లీ, కేంద్రంలో పార్లమెంట్‌ చట్టసభలు. ఈ రెండు సభల్లోనూ అడుగుపెట్టారు కొందరు నేతలు. అసెంబ్లీలో అధ్యక్షా అని, పార్లమెంట్‌లో సభాధ్యక్ష మహోదయ్‌ అంటూ పాలమూరు వాణి వినిపించారు. ఆయా చట్టసభల్లో తమదైన ముద్ర వేసి గుర్తింపు పొందారు. కొందరు తొలుత ఎమ్మెల్యేలుగా గెలిచి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. తర్వాత ఎంపీలుగా గెలిచారు. కేంద్ర మంత్రులుగా కూడా పనిచేశారు. వారిపై కథనం.

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ గ్రామీణం

పార్లమెంట్‌ నుంచి ముఖ్యమంత్రి పీఠానికి

మిడ్జిల్‌ జడ్పీటీసీ సభ్యుడిగా 2006లో ప్రారంభమైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలికి వెళ్లారు. తర్వాత తెదేపాలో చేరారు. 2009లో కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ ఉద్దండుడైన గురునాథ్‌రెడ్డిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెదేపా శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నారు. 2018లో తెదేపాకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

మంత్రిగా పనిచేశాక లోక్‌సభకు

మార్కెటింగ్‌ శాఖ ఉద్యోగైన పోతుగంటి రాములు ఎన్టీఆర్‌పై అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో అచ్చంపేట నియోజవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1999లో మళ్లీ గెలిచారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి డా.వంశీకృష్ణ చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో నాల్గోసారి తెదేపా నుంచి పోటీచేసి గెలుపొంది క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత భారాసలో చేరిన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయత్నం చేసినా టికెట్‌ రాలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారాస నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఇటీవల భారాసను వీడిన రాములు తన కుమారుడు భరత్‌ ప్రసాద్‌తో కలిసి భాజపాలో చేరారు. అధిష్ఠానం నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా భరత్‌ ప్రసాద్‌ను ఖరారు చేయడంతో తన కుమారుడు భరత్‌ విజయం కోసం కృషి చేస్తున్నారు.

ఉత్తమపార్లమెంటేరియన్‌గా గుర్తింపు

రాజకీయ ఉద్దండుల్లో ఒకరైన సూదిని జైపాల్‌రెడ్డి తన ప్రస్థానాన్ని జనతాదళ్‌ పార్టీతో ప్రారంభించారు. 1969లో కాంగ్రెస్‌, జనతాదళ్‌ ఉమ్మడి అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ఇందిర కాంగ్రెస్‌లో చేరిన ఆయన 1972లో పోటీచేసి గెలుపొందారు. తర్వాత ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఇందిర కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జనతాదళ్‌లో చేరారు. 1978, 1983లో రెండుసార్లు జనతాదళ్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1984లో మిత్రపక్షాల అభ్యర్థిగా జనతాదళ్‌ నుంచి మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీచేసి తొలిసారిగా ఎంపీగా గెలిచారు. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1991 - 1992 మధ్యకాలంలో రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. 1998 మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ జనతాదళ్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు. 1999లో కాంగ్రెస్‌లో చేరి మిర్యాలగూడ, 2004లో నల్గొండ లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందారు. 2009లో చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో మహబూబ్‌నగర్‌ నుంచి పోటీచేసి జితేందర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

సోదరుడి వారసుడిగా వచ్చి

ఖమ్మం జిల్లాకు చెందిన డా.మల్లురవి వృత్తిరీత్యా వైద్యుడు. సోదరుడు మల్లు అనంతరాములు నాగర్‌కర్నూల్‌ ఎంపీగా ఉంటూ మృతి చెందడంతో 1991లో రాజకీయ ప్రవేశం చేశారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1996లో కాంగ్రెస్‌ నుంచి మళ్లీ ఎంపీగా పోటీచేసినా గెలవలేదు. తెదేపా అభ్యర్థి మంద జగన్నాథ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 1998 ఎన్నికల్లో డా.మల్లురవి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న వేళ జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న డా.లక్ష్మారెడ్డి భారాస అధినేత కేసీఆర్‌ పిలుపుతో తన పదవికి రాజీనామా చేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో డా.లక్షారెడ్డిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన డా.మల్లురవి గెలుపొందారు. 2009లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రాగా డా.మల్లురవి విజయం సాధించలేకపోయారు. తెదేపా నుంచి పోటీచేసిన ఎం.చంద్రశేఖర్‌ (ఎర్ర శేఖర్‌) ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేసేందుకు డా.మల్లురవికి కాంగ్రెస్‌ అధిష్ఠానం అవకాశం కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని