logo
Published : 29 Nov 2021 01:31 IST

ప్రోత్సాహకం కొరవడి.. క్షీణించిన పాల దిగుబడి

పాడి రైతులకు రాయితీ ఇవ్వడంలో అధికారుల విఫలం
న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌

సేకరణ కేంద్రంలో పాలు పోస్తున్న రైతులు

* జిల్లాలో డెయిరీలు: 01 (విజయ)
* శీతలీకరణ కేంద్రాలు: 06 (చేగుంట, కౌడిపల్లి, రామాయంపేట, రేగోడ్‌, పెద్ద శంకరంపేట, పాపన్నపేట)
* పాల సేకరణ కేంద్రాలు: 150
* పాడి రైతులు: 2150
* రోజువారీ పాల సేకరణ: 5000 లీటర్లు
* రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకం: లీటరుకు రూ.4
* బకాయిలు: రూ.70 లక్షలు (18 నెలలు)
* కిసాన్‌ క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్న రైతులు: 3000
* కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు మంజూరైన రైతుల సంఖ్య: 127

పిల్లలకు తల్లి పాలు ఎంత ముఖ్యమో వారి వయసు పెరుగుతున్న కొద్దీ గేదెలు, ఆవు పాలు సరైన పరిమాణంలో తాగడం కూడా అంతే ముఖ్యం. మనిషి శారీరక ఎదుగుదలకు పాలు, పాల పదార్థాల వినియోగం ఉత్తమమని 20 ఏళ్ల క్రితమే ఐక్యరాజ్య సమితి గుర్తించింది. వైద్యుల సూచన మేరకు ఒక మనిషి రోజుకు 200-400 మిల్లీ లీటర్ల పాలు తాగితే శారీరకంగా దృఢంగా ఉంటారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల ఉత్పత్తి పెంపునకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా పాడి రైతులు ప్రభుత్వ డెయిరీ (విజయ)కి కాకుండా ప్రైవేట్‌ డెయిరీలకు పాలు పోస్తున్నారు.

మెదక్‌ పట్టణ సమీపంలో విజయ డెయిరీ

18 నెలలుగా పేరుకుపోయిన బకాయిలు
పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెన్న శాతంతో సంబంధం లేకుండా లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం ఇస్తోంది. దీంతో రైతులు విజయ డెయిరీ వైపు మొగ్గు చూపడంతో 2019లో జిల్లాలోని 180 పాల సేకరణ కేంద్రాల నుంచి గరిష్టంగా రోజుకు 12 వేల లీటర్ల పాలను సేకరించింది. తర్వాత ప్రోత్సాహకం చెల్లింపుల్లో అలక్ష్యం కారణంగా పాడి రైతులు ప్రైవేటు డెయిరీల వైపు మళ్లారు. 18 నెలలుగా పాడి రైతులకు రూ.70 లక్షల ప్రోత్సాహక మొత్తం బకాయి పేరుకుపోగా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.

అధిక ధర చెల్లిస్తున్న ప్రైవేటు డెయిరీలు
జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయ డెయిరీ కొనసాగుతుండగా ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు అధిక ధర ఇస్తుండటంతో రైతులు వారి వైపు మొగ్గుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సదుపాయాలను రైతులకు చేరవేయడంలో అధికారులు విఫలం కావడం వల్లే.

అందని కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు
కరోనా కారణంగా పాడి రైతులు కూడా నష్టపోయారని భావించిన కేంద్ర ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పథకాన్ని గత సంవత్సరం జూన్‌లో ప్రారంభించింది. పాడి పశువుల కొనుగోలు, షెడ్ల నిర్మాణం, దాణా తదితరాలకు రూ.1.50 లక్షల నుంచి రూ.3.00 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాన్ని ఈ కార్డు ద్వారా పొందవచ్చు. ఈ రుణాన్ని వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 3000 మంది పాడి రైతులు కార్డులకు దరఖాస్తు చేసుకోగా కేవలం 127 మందికి మాత్రమే మంజూరు చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.  

తగ్గిన సేకరణ..
2019లో 180 కేంద్రాల నుంచి రోజుకు 12 వేల లీటర్ల పాలు సేకరించగా 2020లో 183 కేంద్రాల నుంచి రోజుకు 20 వేల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని 12-14 వేల లీటర్ల పాలు సేకరించారు. ఏడాదిలో అంచనాలు తల్లకిందులై ప్రస్తుతం 2150 మంది రైతులు 150 సేకరణ కేంద్రాల్లో రోజూ కేవలం 5000 లీటర్లు మాత్రమే పోస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పాల దిగుబడి మరింత తగ్గే ప్రమాదం ఉంది. జిల్లాలో ఉన్న ఏకైక డెయిరీ సైతం మూతపడే పరిస్థితి రానుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డెయిరీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం..
వేణుగోపాల్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, మెదక్‌

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు జిల్లాలో 3000 మంది పాడి రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు. చాలామంది దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. పాత దరఖాస్తులు అందుబాటులో లేనందున వారితో మళ్లీ దరఖాస్తు చేయించాలని విజయ డెయిరీ అధికారులకు సూచించాం.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని