హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు
కల్హేర్: వ్యక్తిని దూషించడంతోపాటు తిడుతూ, కత్తితో దాడిచేసి గాయపరిచిన కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ జహీరాబాద్ కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ బుధవారం తీర్పు చెప్పినట్లు కల్హేర్ ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం... మీర్ఖాన్పేట్ గ్రామానికి చెందిన ముప్పిడి పెద్దసాయిలును అదే గ్రామానికి చెందిన ముప్పిడి రాములు, ముప్పిడి చిన్న సాయవ్వ, బ్యాగరి విజయరావులు 2021 జనవరిలో దూషించడంతోపాటు కత్తితో దాడిచేసి గాయపరిచారు. అప్పల్లో కల్హేర్ ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి దుర్గాప్రసాద్ ప్రధాన నిందితుడైన ముప్పిడి రాములుకు నాలుగేళ్ల జైలు, రూ. 2 వేల జరిమానా, అతడికి సహకరించిన బేగరి విజయరావు, ముప్పిడి చిన్న సాయవ్వలకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ తీర్చు చెప్పినట్లు ఎస్సై పేర్కొన్నారు.
మహిళపై అత్యాచారం.. కేసు నమోదు
టేక్మాల్, న్యూస్‌టుడే: నెలన్నర క్రితం అత్యాచారానికి గురైన మహిళ అనారోగ్యానికి గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చికిత్స కోసం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి బాధితురాలిని తరలించారు. అక్టోబరు 14న మహిళ(45) టేక్మాల్ మండలం సూరంపల్లిలో కల్లు తీసుకొని ఒంటరిగా వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కుర్మ ఈశ్వరయ్య ఆమెను అడ్డగించి, నోట్లో గుడ్డలు కుక్కి దుకాణం వెనుక అత్యాచారానికి ఒడిగట్టాడు. అతను భయపెట్టడంతో మహిళ ఎవరికీ చెప్పలేకపోయారు. అనంతరం ఆమె అనారోగ్యానికి గురవగా అసలు విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. నవంబరు 30న ఫిర్యాదు చేయగా ఎస్ఐ నాగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పక్కింటికి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే చోరీ
సిద్దిపేట అర్బన్, న్యూస్‌టుడే: పొరుగు వారి వద్దకు పని నిమిత్తం వెళ్లగా కొద్ది నిమిషాల్లోనే సొంతింట్లో చోరీ జరిగింది. ఈ ఘటన సిద్దిపేట పట్టణ శివారు హరిహర రెసిడెన్సీ కాలనీలో చోటుచేసుకుంది. సిద్దిపేట పట్టణ మూడో ఠాణా సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. హరిహర రెసిడెన్సీ కాలనీలో నివాసం ఉండే జోగి అరుణ చిన్నకోడూరు ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. చిన్నకూతురుతో నివాసం ఉంటున్నారు. మంగళవారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చారు. హైదరాబాద్ నుంచి కుమార్తె ఆన్లైన్లో దుస్తులు పంపగా కొరియర్ బాయ్ పక్కింట్లో ఇచ్చాడు. అరుణ, కుమార్తె సహా సాయంత్రం 7.15 గంటల సమయంలో సొంతింటి తలుపు వేసి ప్యాకెట్ తెచ్చుకునేందుకు వెళ్లారు. 45 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బీరువా తెరిచి ఉంది. అనుమానంతో లోపల చూడగా సుమారు ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు, చరవాణి చోరీ అయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ వచ్చి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశారు.
శానిటైజర్ తాగిన ఇంటర్ విద్యార్థిని
రామాయంపేట, న్యూస్‌టుడే: రామాయంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినుల మధ్య బుధవారం గొడవ జరిగింది. ఓ విద్యార్థిని తరగతి గదిలోనే ఉన్న శానిటైజర్ ద్రావణం తాగింది. ఇది గుర్తించిన ఉపాధ్యాయులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తరగతి గదిలో జరిగిన ఘటనను స్నేహితులు ఉపాధ్యాయల దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యులు ప్రమాదం ఏమీ లేదని చెప్పారు.