logo

హరితస్ఫూర్తి.. సంకల్ప దీప్తి..!

వానలు వాపస్‌ రావడమే లక్ష్యంగా.. పచ్చదనం వెల్లివిరియడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని అమలు చేస్తోంది. ఏటా లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతూ వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఒకప్పుడు రాళ్లు, రప్పలతో

Published : 23 May 2022 02:12 IST

ఈసారి 40 లక్షల మొక్కలు..

సమష్టి కృషితో లక్ష్యం చేరిక

ఎనిమిదో విడత హరితహారానికి సన్నద్ధం

న్యూస్‌టుడే, సిద్దిపేట


రాయపోల్‌ మండలం వడ్డేపల్లిలో పల్లె ప్రకృతి వనం..

వానలు వాపస్‌ రావడమే లక్ష్యంగా.. పచ్చదనం వెల్లివిరియడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని అమలు చేస్తోంది. ఏటా లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతూ వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఒకప్పుడు రాళ్లు, రప్పలతో దర్శనమిచ్చిన దారులు.. నేడు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ స్పృహతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి మరోమారు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎనిమిదో విడత హరితహారం కింద జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటేందుకు సన్నద్ధమయ్యారు. మొత్తం 60 రకాల మొక్కలు నాటనున్నారు.

పచ్చదనం.. ఆరోగ్యానికి, ఆనందానికి సంకేతం. మొక్కల పెంపకం, రక్షణతో పర్యావరణ రక్షణ సుసాధ్యం. ఈ నేపథ్యంలో ఏటా మొక్కల పెంపకం ఓ ఉద్యమంలా సాగుతోంది. జిల్లాలో ఐదు పురపాలికలు, 489 పంచాయతీలు (పది ముంపు గ్రామాలు మినహా) ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున నర్సరీ నిర్వహిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆయా చోట్ల 62.15 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఈ సీజన్‌తో పాటు వచ్చే సీజనుకు సరిపడా వాటిని సిద్ధం చేస్తున్నారు. అటవీ శాఖ పరిధిలో మరో 5 లక్షలు పెంచుతున్నారు. పురపాలికలు సైతం నర్సరీలు నిర్వహిస్తున్నాయి. గతంలో మాదిరి ఇబ్బడి ముబ్బడిగా కాకుండా.. ఎంపిక చేసిన స్థలాల్లో నాటనున్నారు. జిల్లాలో శాఖలవారీగా కార్యాచరణ రూపొందించారు. ప్రధానంగా రహదారులకు ఇరువైపులా పూర్తిస్థాయిలో నాటనున్నారు. రెండు నుంచి మూడు వరుసలుగా ఉండే రహదారుల్లో 250 కి.మీ. మేర పెంచనున్నారు. ప్రాజెక్టుల వద్ద, కాల్వలకు ఇరువైపులా, చెరువు సంబంధిత స్థలాలు, ఇతర అనువైన ప్రదేశాలను గుర్తించారు.

బాధ్యత వహించాల్సిందే..
నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం హరితహారం మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. నాటిన మొక్కల్లో 85 శాతం మేర సజీవంగా ఉండాలి.  లేనిపక్షంలో గ్రామ పంచాయతీ పాలన, అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొక్కలు ఎండిపోయినా.. పెంపకంలో నిర్లక్ష్యం వహించినా చట్ట ప్రకారం చర్యలు చేపట్టనున్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ప్రక్రియను ప్రారంభించింది. మొక్కలు నాటేందుకు వీలుగా ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీసే పనులు మొదలయ్యాయి. వాటికి నీళ్లు పట్టేందుకు వనసేవకులను నియమించనున్నారు. వారి ద్వారా నిత్యం నీటిని అందిస్తూ.. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పంచాయతీల్లో ఎదిగిన చెట్లను కొట్టేసిన, తొలగించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాగ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌.. ఇతర శాఖలు సంయుక్తంగా ప్రజాప్రతినిధుల సహకారంతో హరితహారం ప్రక్రియను పక్కాగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. గత సంవత్సరం 40 లక్షల మొక్కలు నాటగా.. 94 శాతం మేర బతికినట్లు అధికారులు చెబుతున్నారు.

మండలానికి ఐదు పల్లె ప్రకృతి వనాలు..
మండలానికి ఐదు బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే నెల 30వ తేదీలోపు మండలానికి మూడు చొప్పున పూర్తి చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు బృహత్‌ పల్లె ప్రకృతి వనాలకు 3 నుంచి 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించే పనుల్లో నిమగ్నమయ్యారు. అనువైన ప్రాంతాలకు ఎంపీడీవో, తహసీల్దార్లు ఉమ్మడిగా పరిశీలన చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 23 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు కొనసాగుతున్నాయి. అటవీ స్థలాల్లోనూ పెంచేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇంటికి ఆరు చొప్పున పూలు, పండ్ల మొక్కలు అందించనున్నారు.


అందరి భాగస్వామ్యంతో..: గోపాల్‌రావు, డీఆర్డీవో
సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ అమలు చేస్తున్నాం. హరితహారంలో ప్రజా భాగస్వామ్యం కూడా కీలకమే. అందరూ బాధ్యత వహించాలి. అప్పుడే హరిత స్ఫూర్తిని చాటవచ్చు. అన్ని శాఖల సమన్వయంతో లక్ష్యాన్ని చేరతాం. పక్కాగా మొక్కలు నాటి స్ఫూర్తిని చాటుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని