logo

Siddipet: ‘గూగుల్‌’లో రోడ్డుంది.. నీళ్లలోకి లారీ వెళ్లింది!

 ‘ఎవడే సుబ్రమణ్యం’  సినిమాలో హిమాలయా ల్లోని దూద్‌కాశీకి వెళ్లడానికి చరవాణిలో గూగుల్‌ పటాన్ని చూస్తూ  హీరో వెళ్తుంటాడు..

Updated : 07 Sep 2023 08:44 IST

యువకుల సాయంతో గౌరవెల్లి ప్రాజెక్టులో తప్పిన ప్రమాదం

ప్రాజెక్టు నీటిలో చిక్కుకున్న లారీ

అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం), న్యూస్‌టుడే:  ‘ఎవడే సుబ్రమణ్యం’  సినిమాలో హిమాలయాల్లోని దూద్‌కాశీకి వెళ్లడానికి మొబైల్‌లో గూగుల్‌ మ్యాప్‌ చూస్తూ హీరో వెళ్తుంటాడు.. మ్యాప్‌ ఆధారంగా వెళ్తే భారీ కొండ అంచుకు చేరతాడు.. కానీ అనుకున్న చోటు కనబడదు. ఇది సరదాగా తీసిన సన్నివేశమైనా సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి జలాశయం విషయంలో ‘గూగుల్‌’ తప్పుదారి పట్టించి, ప్రమాదంలోకి నెట్టేసింది. అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలో ఓ లారీ చిక్కుకుంది. బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు ఈ ఘటన జరిగింది.

తమిళనాడుకు చెందిన లారీ మంగళవారం రాత్రి చేర్యాల మీదుగా హుస్నాబాద్‌ వస్తోంది. డ్రైవర్‌ శివ, క్లీనర్‌ మొండయ్యకు దారిపై సరైన అవగాహన లేదు. ఫోన్‌లో గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ ఆధారంగా వస్తున్నారు. నందారం స్టేజీ దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్‌ చూపింది. చీకట్లో లారీని నడుపుతూ అలాగే వెళ్లారు. వాన వల్ల నిలిచిన నీరు అనుకున్నారు. ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది. లారీ క్యాబిన్‌ వరకు నీళ్లు ఉన్నాయి. కొద్దిగా లోపలికి వస్తున్నాయి. వాహనం పనిచేయడం ఆగింది. వారిద్దరూ కిందకు దిగి మెల్లగా సమీపంలోని రామవరం వచ్చారు.

గ్రామస్థులకు తెలపగా ఎంపీటీసీ సభ్యుడు లింగాల శ్రీనివాస్‌, గుడాటిపల్లి సర్పంచి బద్దం రాజిరెడ్డి, యువకులు వోలాద్రి మహేశ్‌, లింగాల చందు, రచ్చ సత్యనారాయణ వెళ్లారు. లారీకి తాళ్లు కట్టి వెనక్కు లాగడంతో అతికష్టం మీద బయటకు వచ్చింది. వాస్తవంగా నందారం స్టేజీ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను అక్కడి నుంచి బైపాస్‌రోడ్డు ద్వారా మళ్లించారు. స్టాపర్లు రోడ్డు పక్కన పడిపోయాయి. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా దారి పూర్తిగా మూసేయాలని స్థానికులు కోరుతున్నారు.

వాహనాన్ని బయటకు తేవడానికి సహకరించిన వారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని