logo

హుస్నాబాద్‌.. మూడు జిల్లాల్లో..

తెలంగాణ సాయుధ పోరాటం పేరు వినగానే హుస్నాబాద్‌ పేరు కళ్ల ముందు మెదులుతుంది. నిజాం నిరంకుశ పాలనకు భూస్వామ్య పెత్తందారీ, బానిస విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరిగాయి.

Updated : 08 Nov 2023 05:57 IST

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ : తెలంగాణ సాయుధ పోరాటం పేరు వినగానే హుస్నాబాద్‌ పేరు కళ్ల ముందు మెదులుతుంది. నిజాం నిరంకుశ పాలనకు భూస్వామ్య పెత్తందారీ, బానిస విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరిగాయి. అప్పట్లో కోహెడ పోలీసుస్టేషన్‌పై దాడి సంచలన సృష్టించింది. ఒక విధంగా చెప్పాలంటే రజాకార్లపై జరిగిన ఉద్యమానికి ఈ ప్రాంతమే గుండెకాయ. ఇక్కడివారు రజాకార్ల దాడులు, నిజాం పోలీసుల అరాచకాలకు ఎదురొడ్డారు. తొలిసారిగా ఎన్‌కౌంటర్‌ జరిగింది కూడా ఇక్కడే. హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ గుట్టల్లో జరిగిన సంఘర్షణలో అనభేరి ప్రభాకర్‌ దళ సభ్యులు 14 మంది అమరులయ్యారు. ఆసియా ఖండంలోనే రెండోదిగా చెప్పే అమరుల స్తూపాన్ని నిర్మించారు. తెలంగాణ మలిదశ ఉద్యమం సైతం ఉద్ధృతంగా సాగింది.

మారుతూ వచ్చి..

హుస్నాబాద్‌ నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి ఉండటం గమనార్హం. 1952లో నుస్తులాపూర్‌ నియోజకవర్గం, ఆ తర్వాత 1957లో ఇందుర్తి ఆవిర్భావం జరిగింది. ఇక 2008లో పునర్విభజనలో భాగంగా హుస్నాబాద్‌ను ఏర్పాటుచేశారు. కరీంనగర్‌ జిల్లాలో కొనసాగింది. స్వరాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజనలో మూడు భాగాలుగా విడిపోయి మూడు జిల్లాల్లో విస్తరించింది.

సిద్దిపేట జిల్లా పరిధిలోకి నియోజకవర్గ కేంద్రం  హుస్నాబాద్‌, కోహెడ, అక్కన్నపేట మండలాలు వచ్చాయి. కరీంనగర్‌ జిల్లాలో చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాలు, హనుమకొండ జిల్లాలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు చేరాయి. వీటితోపాటు వేలేరు మండలంలోని ఎర్రబెల్లి మల్లారం గ్రామాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో 2,36,570 మంది ఓటర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని