logo

కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు

కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు.

Published : 28 Mar 2024 01:58 IST

కార్డుల నవీకరణ తప్పనిసరి

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. ప్రతీ ఐదేళ్లకోసారి కార్డులను నవీకరించకపోవడంతో ఏటా కొంత మంది పథకాలకు దూరమవుతున్నారు.

ఐదేళ్లకోసారి తప్పనిసరి

దాదాపు 52 రకాల పనులు చేసే కార్మికులు కార్డులు పొందవచ్చు. ప్రతి ఐదేళ్లకు ఒక్కసారి మీ-సేవ కేంద్రాల ద్వారా నవీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేటలో కార్మిక శాఖ కార్యాలయాలు ఉన్నాయి. నిర్ధేశిత వ్యవధి దాటిన తర్వాత గరిష్ఠంగా మూడు నెలల్లోపు నవీకరణ చేసుకోవచ్చు. కాల వ్యవధి పూర్తయిన తర్వాత రెన్యూవల్‌ చేసుకున్నప్పటికీ మరలా ఒక సంవత్సరం వరకు ప్రభుత్వం అందజేసే ఎలాంటి పథకాలకు అర్హత సాధించలేరు.

దరఖాస్తు చేసుకునే విధానం..

18-58 వయస్సు మధ్య ఉన్న వారు ప్రతి ఐదేళ్లకోసారి రూ.60 చెల్లించి మీ-సేవలో సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ పత్రాలను సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలి. దరఖాస్తులను స్వీకరించిన అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిజమైన కార్మికులు అని నిర్ధారించుకున్న తర్వాత రాష్ట్ర శాఖకు పంపిస్తారు. అక్కడ ఆమోదించిన వెంటనే మీ-సేవలో కార్డు పొందవచ్చు.

కుటుంబ సభ్యులకు ధీమా

  • కార్మికుడికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే కుటుంబ సభ్యులకు బీమా ప్రయోజనాలు లభిస్తాయి. సహజ మరణానికి రూ.లక్ష, ప్రమాద మరణానికిరూ.6 లక్షలతో పాటు అంత్యక్రియల కోసం రూ.30 వేలు అందజేస్తారు.
  • ప్రసూతి ఖర్చులకు రూ.30 వేలు, పెళ్లి ఖర్చులకు రూ.30 వేల చొప్పున అందజేస్తారు.
  • ఏదైనా ప్రమాదం సంభవించి అస్పత్రిలో ఉంటే నెలకు రూ.3,500 చొప్పున మూడు నెలల పాటు అందజేస్తారు.
  • అంగవైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం పరిహారం చెల్లిస్తారు.

జిల్లా వివరాలు

కార్మికుల గుర్తింపు కార్డులు: 21 వేలు
మనుగడలో ఉన్నవి: 17 వేలు
లేనివి: 4 వేలు


సంఘాలకు సమాచారం ఇస్తున్నాం

ఆన్‌లైన్‌ వ్యవస్థ లేక ముందు కార్మికులకు పలు రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ప్రస్తుతం కార్మికుల్లో సైతం అవగాహన పెరిగింది. ప్రధానంగా వారి వృత్తికి దూరం అయిన వారు, మరిచిపోయిన వారు, వయసు పైబడిన వారు రెన్యూవల్‌ చేసుకోవడం లేదు. వ్యాప్తంగా ఉన్న ఆయా సంఘాల వారికి సమాచారమిచ్చి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం.

యాదయ్య, సహాయ కార్మిక శాఖ అధికారి మెదక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని