logo

పురపాలికల్లో పట్టు.. విజయానికి మెట్టు

మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి.

Updated : 23 Apr 2024 06:19 IST

లోక్‌సభ ఎన్నికల వేళ.. అసంతృప్త కౌన్సిలర్లపై పార్టీల దృష్టి

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్‌, జిన్నారం: మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురపాలికల అధ్యక్షులు, కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. వివాహాలు, ఇతర ఏ కార్యక్రమాలు జరిగినా హాజరవుతున్నారు. పురపాలికల అసంతృప్త కౌన్సిలర్లతో చర్చిస్తూ పార్టీలోకి చేర్చుకునే యత్నం చేస్తున్నారు. ఇటీవల అందోలు-జోగిపేట పురాధ్యక్షుడు మల్లయ్య, ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కౌన్సిలర్ల మద్దతు ఉంటే పట్టణాల్లో పట్టు సాధించవచ్చని నేతలు భావిస్తున్నారు.

జహీరాబాద్‌ మినహా అన్ని చోట్ల..

జిల్లాలో 8 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటిలో 199 వార్డులున్నాయి. ఒక్క జహీరాబాద్‌లో మాత్రం పాలకవర్గం లేదు. మిగిలిన ఏడు చోట్ల పాలకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు చోట్ల 162 మంది కౌన్సిలర్లు పదవుల్లో కొనసాగుతున్నారు. వీటిలో మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఐదు, జహీరాబాద్‌ కింద మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్‌ స్థానం పరిధిలోని ఐదు పురపాలికలకు భారాసకు చెందినవారే అధ్యక్షులు. సంగారెడ్డి పురపాలిక అధ్యక్షురాలు విజయలక్ష్మిపై కొన్ని రోజుల క్రితం సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం పెట్టగా వీగిపోయింది. అప్పటి నుంచి మనస్తాపం చెందిన విజయలక్ష్మి భారాస కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అధ్యక్షురాలు పార్టీకి దూరంగా ఉండటంతో ఆమె మద్దతుదారులు ఎటువైపు ఉంటారోనని ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ భారాసకు 21, కాంగ్రెస్‌కు 11, భాజపాకు ముగ్గురు, ఎంఐఎంకు ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. ఐడీఏ బొల్లారంలో రెండు నెలల క్రితం ఆరుగురు భారాస కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌ పురపాలికల్లో భారాసకే ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారు.

ఎవరి మద్దతు ఎవరికో..

పురపాలికల్లో ఒక్కో వార్డు పరిధిలో సుమారు 1000 నుంచి రెండు వేల మంది ఓటర్లు ఉంటారు. కౌన్సిలర్లకు ఓటర్ల నాడిపై పట్టు ఉంటుంది. అసంతృప్త కౌన్సిలర్లు లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారోనని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎక్కువ పురపాలికల్లో భారాస పాగా వేసిన్పటికీ .. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నందున పరిణామాలు మారుతున్నాయి. కేంద్రంలో మళ్లీ భాజపా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ.. ఆ పార్టీ నేతలూ పట్టణాల్లో పట్టు సాధించేలా ప్రయత్నిస్తున్నారు. భారాస నేతలు తమ సభ్యులను కాపాడుకోవడంతో పాటు కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి అభ్యర్థిని గెలిపించుకునేలా వ్యూహరచన చేస్తున్నారు.

రెండు చోట్ల ‘చే’జిక్కాయి

జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మూడు పురపాలక సంఘాలు ఉన్నాయి. జహీరాబాద్‌లో మున్సిపాలిటీ ఎన్నికలు జరగకపోవడంతో పాలకవర్గం లేదు. అందోలు-జోగిపేట పురపాలక అధ్యక్షుడు మల్లయ్య, ఉపాధ్యక్షుడు ప్రవీణ్‌తో పాటు ఓ కౌన్సిలర్‌ ఇటీవల మంత్రి దామెదర్‌ రాజనర్సింహ సమక్షంలో భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. మరో ఇద్దరు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ పురపాలికలో భారాస కౌన్సిలర్ల సంఖ్య తగ్గి.. కాంగ్రెస్‌ పుంజుకుంది. నారాయణఖేడ్‌లో మూడు నెలల క్రితం ఇద్దరు కౌన్సిలర్లు భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం అవిశ్వాస తీర్మానం పెట్టడంతో భారాస నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని