logo

కాంగ్రెస్‌ది అవినీతి, కుటుంబ పాలన

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 23 Apr 2024 02:01 IST

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌

బీబీ పాటిల్‌ను సన్మానిస్తున్న పీయూష్‌ గోయల్‌ 

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరని ఎద్దేవా చేశారు. అవినీతి, కుటుంబ పాలనకు కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో భారాస అవినీతికి పాల్పడటంతో గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, భారాస శకం ముగిసినట్లేనని పేర్కొన్నారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే విజయ సోపానాలన్నారు. పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి కేంద్ర పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా, అవినీతి లేకుండా పదేళ్లు దేశాన్ని పాలించిన ఘనత ప్రధానమంత్రి మోదీకి దక్కిందన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా పని చేస్తున్నామని, జహీరాబాద్‌లో భాజపా అభ్యర్థి బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, భారాసలు కుటుంబ పార్టీలని విమర్శించారు. బీబీ పాటిల్‌ మాట్లాడుతూ... ఓటర్లు ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నిధులు తీసుకొచ్చి జహీరాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా జాగృతి సంస్థ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌ పాటిల్‌ భాజపాలో చేరారు. అంతకుముందు పటాన్‌చెరు మండలం రుద్రారం నుంచి సంగారెడ్డి పట్టణంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌ వరకు భాజపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి నేరళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, విజయ్‌పాల్‌రెడ్డి, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పార్టీ అధ్యక్షులు అరుణతార, గోదావరి, అధికార ప్రతినిధి సంగప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, చీకోటి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని