logo

పెరుగుతున్న ప్రచార వేడి

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్‌ వేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున మెదక్‌ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు.

Published : 24 Apr 2024 03:11 IST

రంగంలోకి దిగుతున్న ప్రధాన పార్టీల అగ్రనేతలు

న్యూస్‌టుడే, మెదక్‌:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్‌ వేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున మెదక్‌ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. బుధవారం మంచి ముహూర్తం ఉండడంతో మిగతా అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. ఓ వైపు అన్ని పార్టీల ముఖ్య నేతలు ప్రచారం చేస్తూ.. మరోవైపు నియోజకవర్గం, మండలాలు, పట్టణాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ.. శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మెదక్‌ లోక్‌సభ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీల అగ్ర నేతలు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోలింగ్‌ సమీపిస్తుండడంతో సమయాన్ని బట్టి ఆయా పార్టీల ముఖ్యనేతలతో పార్లమెంట్‌ పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో సభలు, రోడ్డు షో, కార్నర్‌ మీటింగ్‌ల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.

 సంగారెడ్డి, సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి సభలు...

 మాజీ సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా కావడంతో అధికార కాంగ్రెస్‌.. మెదక్‌ లోక్‌సభ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా ఈసారి ఎంపీ స్థానాన్ని గెలవాలనే కృతనిశ్చయంతో ఉంది. ప్రముఖుల పర్యటనలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా మెదక్‌లో ఈనెల 20న ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక రాందాస్‌ చౌరస్తాలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. మెదక్‌లో ప్రచార కార్యక్రమం విజయవంతం కావడంతో.. సిద్దిపేట, సంగారెడ్డి పట్టణాల్లో సైతం సీఎం సభలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ లేదా ప్రియాంక గాంధీ పార్లమెంట్‌ పరిధిలో ఏర్పాటు చేసే సభలకు హాజరయ్యే అవకాశం ఉందని సిద్దిపేట, మెదక్‌ డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, ఆంజనేయులుగౌడ్‌ తెలిపారు. ఎన్నికల బరిలో బీసీ అభ్యర్థి ఉండడంతో.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎన్నికల ప్రచార సభలో పాల్గొనే అవకాశం ఉంది.

రేపు సిద్దిపేటకు అమిత్‌షా...

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్న భాజపా... దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్‌కు ముందు పటాన్‌చెరులో ప్రధాని మోదీ సభ నిర్వహించారు. పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్‌ వేసిన రోజున గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మెదక్‌లో జరిగిన రోడ్డుషోలో పాల్గొన్నారు. ఈనెల 25 గురువారం సిద్దిపేటకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌, తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలైతో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించాలని ఈ పార్టీ భావిస్తోంది.

కేసీఆర్‌ రోడ్డుషోలు..

2004 నుంచి వరుసగా విజయకేతనం ఎగురవేస్తున్న భారాస.. ఈసారీ సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ లోక్‌సభ స్థానానికి మాజీ మంత్రి హరీశ్‌రావు ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. అన్ని సమావేశాలు, రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 24 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సొంత జిల్లాలో పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరఫున ప్రధాన పట్టణాల్లో ఆయన బస్సు యాత్ర కొనసాగనుంది. వచ్చే నెల 7న రాత్రి మెదక్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు. ఆ రోజు మెదక్‌లో బస చేసి, మరుసటి రోజు 8న నర్సాపూర్‌, పటాన్‌చెరులో సాయంత్రం జరిగే రోడ్‌షోకు హాజరవుతారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన మే 11న సిద్దిపేటలో సాయంత్రం జరిగే రోడ్‌షోలో కేసీఆర్‌ పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని