logo

వసతులు కొరవడి.. అన్నదాత అలజడి

జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు.

Published : 02 May 2024 06:33 IST

మెదక్‌లోని కేంద్రంలో అద్దె టార్పాలిన్లలో వడ్లు ఆరబోస్తూ..

న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌: జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. అయితే అకాల వర్షాలతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు కారణం కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడమే. వర్షం కురిస్తే ధాన్యం తడవకుండా  ఉండేందుకు నిర్వాహకులు టార్పాలిన్లు సమకూర్చడం లేదు. దీంతో వాటిని అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.జిల్లా వ్యాప్తంగా 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 28 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని బట్టి టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి. కొన్ని  అందజేశామని మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

సౌకర్యాల కల్పనలో విఫలం

పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. తూకం యంత్రాలు, గన్నీబస్తాలు, తదితర వాటిని సమకూర్చాల్సిన బాధ్యత మార్కెటింగ్‌ శాఖ అధికారులదే. ఇందుకోసం వరి కోతల ప్రారంభానికి ముందే అంచనాతో కార్యాచరణ రూపొందిస్తారు. సీజన్‌కు ముందుగానే మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అరకొరగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఎండలు మండుతున్నా, కనీసం తాగునీటి వసతి కల్పించడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఆయా కేంద్రాలకు ప్రస్తుత సీజన్‌లో 565 టార్పాలిన్లు పంపిణీ చేశారు. వీటిని కొన్నికేంద్రాల్లో ఇస్తుండగా, మరికొన్ని చోట్ల ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.


ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తాం
- నాగరాజు, ఇన్‌ఛార్జి జిల్లా మార్కెటింగ్‌ అధికారి, మెదక్‌

ఈ సీజన్లో 565 టార్పాలిన్లు కేంద్రం నిర్వాహకులకు పంపిణీ చేశాం. వాటిని రైతులకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఒక వేళ ఇవ్వకపోతే మా దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తాం. ఇబ్బందులు ఎదురవ్వకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని