logo

దేవుళ్లతో రాజకీయం చేయడం సరికాదు

దేవుళ్లతో భాజపా రాజకీయం చేయడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం రాత్రి మెదక్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 05 May 2024 01:39 IST

మంత్రి కొండా సురేఖ

మెదక్‌లో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ, చిత్రంలో నీలం మధు

మెదక్‌ రూరల్‌, న్యూస్‌టుడే: దేవుళ్లతో భాజపా రాజకీయం చేయడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం రాత్రి మెదక్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన చిన్నప్పటి నుంచి శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని.. కొత్తగా భాజపా చేసిందేమీ లేదని అన్నారు. రఘునందన్‌రావు దుబ్బాకలో గెలిచి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్‌, మెదక్‌ పురపాలక సంఘం అధ్యక్షుడు చంద్రపాల్‌, నాయకులు మోల్సాబ్‌, అశోక్‌ , శ్రీనివాస్‌ చౌదరి, జీవన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: ప్రతి కార్యకర్త మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి నీలంమధు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సూచించారు. నర్సాపూర్‌ వచ్చిన ఆమె పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో శనివారం మాట్లాడారు. పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. నర్సాపూర్‌ నుంచి నీలంమధుకు అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి కృషి చేయాలన్నారు. నర్సాపూర్‌లో ఈనెల 7న ప్రియాంక గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించాల్సి ఉండగా ఎండవేడిమి కారణంగా నీరసించి పోయిన ఆమె అక్కడికి వెళ్లకుండా పార్టీ కార్యాలయంలోనే విశ్రాంతి తీసుకున్నారు.

హరీశ్‌రావు జైలుకు వెళ్లడం ఖాయం: మైనంపల్లి

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి హరీశ్‌రావు జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. నర్సాపూర్‌లో వెల్దుర్తి వెళ్లే మార్గంలో ఈనెల 7వ తేదీన నిర్వహించనున్న కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను మెదక్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలంమధు, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజిరెడ్డిలతో కలిసి శనివారం స్థల పరిశీలన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకుని, రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం, ఫోన్‌ ట్యాపింగ్‌, మిషన్‌ భగీరథ, అసైన్డు, ప్రభుత్వ, వక్ఫ్‌ భూముల కబ్జాల్లో హరీశ్‌రావు జైలుకు వెళ్లనున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్‌కు మెజార్టీ వస్తుందని, వారు ఎన్ని డబ్బులు పంచినా ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని నిర్ణయించారని అన్నారు. ఆగస్టు 15న రాజీనామాకు హరీశ్‌రావు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. పెద్దాయన అని కూడా చూడకుండా మదన్‌రెడ్డిపై హరీశ్‌రావు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రియాంక గాంధీ బహిరంగసభకు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాలను తరలిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని