logo

హ్యాట్రిక్‌ విజయం ఖాయం: హరీశ్‌రావు

అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌, భాజపాలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Published : 05 May 2024 01:43 IST

ప్రసంగిస్తున్న హరీశ్‌రావు, చిత్రంలో అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌, భాజపాలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి అక్బర్‌పేట-భూంపల్లి మండల కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి భారాస మెదక్‌ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉద్యమాల పురిటిగడ్డ మెదక్‌ స్థానంపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా లేక మోటార్లు కాలిపోతున్నాయన్నారు. కుల రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్‌ బస్సు యాత్ర సూపర్‌ హిట్‌ కావడంతో కాంగ్రెస్‌, భాజపాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆగస్టు 15న రూ.రెండు లక్షల రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మతం పేరుతో భాజపా, రిజర్వేషన్ల ప్రచారంతో కాంగ్రెస్‌ ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయన్నారు.

జాబ్‌మేళాతో ఉద్యోగాలు: అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటేయాలని ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డి మిరుదొడ్డిలో జరిగిన ప్రచారంలో మాట్లాడుతూ అన్నారు. కలెక్టర్‌ గా పనిచేసిన సమయంలో ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఫీజు సాయం చేశామన్నారు. నిరుపేద యువతి యువకులకు ఉచితంగా కోచింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, శిక్షణ అందించి, జాబ్‌ మేళాలతో ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసిన రఘునందన్‌ను మరోసారి చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసుకోవడానికి ధర్నాలు చేయాల్సి వచ్చిందన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని