logo

అనుత్తీర్ణులపై ప్రత్యేక శ్రద్ధ

ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి

Published : 08 May 2024 02:55 IST

ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

 

పరీక్ష కేంద్రంలో విద్యార్థులు

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే : ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి. కానీ ప్రత్యేక తరగతులు, సిలబస్‌ తదితర కార్యక్రమాలు చేపట్టినా.. రాష్ట్ర స్థాయిలో జిల్లా ఉత్తమ ప్రతిభ కనబర్చలేకపోతుంది. త్వరలో ప్రారంభంకానున్న సప్లిమెంటరీ ఫలితాల్లో అయినా విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అనుత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇంటర్‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు.  

ఆన్‌లైన్‌ ద్వారా బోధన..

ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతుండడంతో పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో విద్యార్థులకు పాఠ్యాంశాల వారీగా అధ్యాపకులతో ఆన్‌లైన్‌ ద్వారా బోధన నిర్వహించనున్నారు. ఫెయిల్‌ అయిన సబ్జెక్టులపై ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు. ప్రస్తుతం అధ్యాపకులకు ఎన్నికలకు సంబంధించిన శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. అందువల్ల వారి వీలు ప్రకారం తరగతులు తీసుకుంటున్నారు. ఎన్నికల అనంతరం ఒక క్రమ పద్ధతిలో బోధన తరగతులు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 3641 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇందులో జనరల్‌ విభాగంలో 3489 మంది, ఒకేషనల్‌లో 152 మంది విద్యార్థులు ఉన్నారు. ద్వితీయ సంవత్సరానికి 2283 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇందులో జనరల్‌ విభాగంలో 2149 మంది, ఒకేషనల్‌లో 134 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఫీజులు చెల్లించారు.  

పోటీ పరీక్షలకు సైతం

ప్రభుత్వ కళాశాలల్లో అభ్యసించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంసెట్‌, నీట్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కఠిన అంశాలపై సమగ్ర పట్టు సాధించేలా చర్యలు చేపడుతారు. రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రంలోని అన్ని అంశాలపై విద్యార్థులకు వివరించనున్నారు. ఎలాంటి సందేహాలున్నా అప్పటికప్పుడు నివృత్తి చేయనున్నారు.


ఉత్తమ ఫలితాలు సాధించమే లక్ష్యం
- సత్యనారాయణ, జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి

ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలకు సూచించాం. కొన్ని కళాశాలల్లో ఒక్కో సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఉన్నారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తే వారు ఉత్తీర్ణత సాధించడంతో పాటు రాష్ట్రంలో జిల్లా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నందున సరైన సమయాల్లో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడం లేదు. ఎన్నికల తర్వాత ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని