logo

వడివడిగా సర్వే పనులు

అత్యంత కీలక ప్రాజెక్టుగా చెబుతున్న హైదరాబాద్‌ ప్రాంతీయ వలయ రహదారి పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ హైదరాబాద్‌

Published : 18 Jan 2022 02:40 IST

ట్రిపుల్‌ఆర్‌ ప్రాజెక్టులో ముందడుగు

తుర్కపల్లి మండలంలో నాటిన హద్దురాళ్లు

భువనగిరి, న్యూస్‌టుడే: అత్యంత కీలక ప్రాజెక్టుగా చెబుతున్న హైదరాబాద్‌ ప్రాంతీయ వలయ రహదారి పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ హైదరాబాద్‌ బాహ్య వలయదారి వెలుపల రీజనల్‌ రింగ్‌రోడ్డు పనులకు ప్రతిపాదించిన విషయం విధితమే. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలపడంతో సర్వే పనులు పుంజుకున్నాయి. మొదటి దశలో 158 కి.మీ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చజెండా ఊపాయి. గత శుక్రవారం మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో రహదారి వెళ్లే మార్గంలో భూముల సర్వే మొదలుపెట్టారు. సమగ్ర నివేదిక తయారీ కోసం ప్రైవేట్‌ సంస్థ హద్దురాళ్లు నాటే పనిని చేపట్టింది. గత రెండు రోజులుగా సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం పీర్లపల్లిలో కొలతలు చేపట్టి హద్దురాళ్లు నాటుతున్నారు. ఈ సర్వే పనులు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మొదలయ్యాయి. జిల్లాలోని ప్రతిపాదిత ప్రాంతంలో అలైన్‌మెంట్‌ కోసం ఐదు కి.మీ ఒక హద్దురాయి చొప్పున నాటడం మొదలుపెట్టారు. తుర్కపల్లి మండలం గంధమల్ల, వీరారెడ్డిపల్లి, కోనాపూర్‌, ఇబ్రహీంపూర్‌, దత్తాయిపల్లి, వేల్పుపల్లి మీదుగా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్‌, దాతార్‌పల్లి వరకు సర్వే జరిగింది. దాతారుపల్లి నుంచి భువనగిరి మండలం బస్వాపూర్‌, రాయగిరి, భువనగిరి, కేసారం మీదుగా హద్దురాళ్లు నాటారు. తుర్కపల్లి మండలంలో ఆరు గ్రామాలు, యాదగిరిగుట్ట మండలంలో రెండు గ్రామాలు, భువనగిరి మండలంలో 9 గ్రామాలు, వలిగొండ మండలంలో నాలుగు గ్రామాల మీదుగా ప్రాంతీయ వలయరహదారి వెళ్లనుంది. హద్దురాళ్లు నాటడంతో రైతులు తమ భూములు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ మండలాల్లో పాంతీయ వలయరహదారిపై చర్చ జరుగుతోంది. రహదారి వెళ్తున్న ప్రాంతాన్ని ప్రాథమికంగా గుర్తించి పూర్తిస్థాయిలో సర్వే చేపట్టిన తర్వాత భూయజమానులకు పరిహారం చెల్లింపు పనులు చేపడుతామని సర్వే అధికారి తెలిపారు. జిల్లాలో రహదారి నిర్మాణానికి భూసేకరణకు భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని