logo

చిచ్చర పిడుగులు.. బ్యాడ్మింటన్‌లో మెరుపులు

ఆసక్తికి ఉత్తమ శిక్షణ తోడైతే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు. అటు  చదువులో, ఇటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీడ్రాపోటీల్లో ప్రతిభ కనబరుస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న

Published : 27 Jan 2022 03:50 IST

- మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే

ఆసక్తికి ఉత్తమ శిక్షణ తోడైతే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు. అటు  చదువులో, ఇటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీడ్రాపోటీల్లో ప్రతిభ కనబరుస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న చిన్నారులపై ‘న్యూస్‌టుడే’ కథనం.  


చిన్నప్పటి నుంచే ఆసక్తి

జిల్లా శిక్షకుడు రామకృష్ణ వద్ద శిక్షణ పొందుతున్న వెంకటసాయి వైష్ణవి

మిర్యాలగూడ పట్టణానికి చెందిన పెండెం ప్రేమ్‌కుమార్‌-పార్వతిదేవి దంపతుల కుమార్తె వెంకటసాయి వైష్ణవి ప్రసుత్తం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వైష్ణవి చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కనబరుస్తుండడంతో నాలుగేళ్ల క్రితం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో జిల్లా శిక్షకుడు మారబోయిన రామకృష్ణ వద్ద చేర్పించగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తుంది వైష్ణవి. అంతర్జాతీయ స్థాయిలో రాణించి.. దేశానికి, తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావడమే లక్ష్యమని బెబుతోంది ఈ చిన్నారి.

వైష్ణవి ఘనతలు...

2020లో హైదరాబాద్‌లో నిర్వహించిన అండర్‌-14 రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం.

2019లో బెంగళూరులో అండర్‌- 9 జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ.

2019లో హైదరాబాద్‌లో జరిగిన అండర్‌-9 రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం.

2019లో ఎస్‌.ఎస్‌.బ్యాడ్మింటన్‌ అకాడమీ వారి అండర్‌-9 రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం.

2019లో చేతన్‌ ఆనంద్‌ అకాడమీ రాష్ట్ర స్థాయి అండర్‌-9 పోటీల్లో సింగిల్స్‌, డబుల్స్‌లో బంగారు పతకాలు.

2019లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో అండర్‌-13 విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపిక.

2019లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్‌-9 పోటీల్లో బంగారు పతకం.


గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ

గవ్వ అశ్మిత్‌రెడ్డి

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గవ్వ వెంకట్‌రెడ్డి-శిల్పారెడ్డిలు తమ వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అక్షిత్‌రెడ్డి, అశ్మిత్‌రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్న అక్షిత్‌రెడ్డి బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సైతం పాల్గొన్నాడు. తన అన్నను చూస్తూ తను కూడా చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌పై ఇష్టం పెంచుకున్న అశ్మిత్‌రెడ్డి పలు పోటీల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న అశ్మిత్‌ పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో రెండేళ్లుగా శిక్షణ పొందుతున్నాడు. చదువుతో పాటు బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న అశ్మిత్‌ పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాడు. మంచి ఉద్యోగంతో పాటు బ్యాడ్మింటన్‌లో దేశం తరపున ఆడడమే తన లక్ష్యంగా సాధన చేస్తున్నాడు.

అశ్మిత్‌ విజయాలు...

2021లో సూర్యాపేట జిల్లా స్థాయి పోటీల్లో రజత పతకం.

2019లో హైదరాబాద్‌లో నిర్వహించిన స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం. 

2019లో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం.

2019లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఖేల్‌ ఉత్సవ్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని