logo

ఆసక్తి గుర్తించి.. అభిరుచి తెలుసుకుని

మహిళలు ప్రేమాభిమానాలతో పాటు పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలే. అన్ని రంగాల్లో విజయం సాధించగల సత్తా వారికి ఉంటుంది. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపటంతో చాలా కుటుంబాల జీవన విధానంలో మార్పులోచ్చాయి.

Published : 28 Jun 2022 04:55 IST

మహిళలకు ఇంటి వద్దే నైపుణ్య శిక్షణ అందిస్తున్న కేవీకే


మిర్యాలగూడ శ్రీనివాసనగర్‌లో శిక్షణ ఇస్తున్న శాస్త్రవేత్త

గరిడేపల్లి, న్యూస్‌టుడే: మహిళలు ప్రేమాభిమానాలతో పాటు పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలే. అన్ని రంగాల్లో విజయం సాధించగల సత్తా వారికి ఉంటుంది. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపటంతో చాలా కుటుంబాల జీవన విధానంలో మార్పులోచ్చాయి. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. అయితే పారిశ్రామిక రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించాలంటే కచ్చితంగా శిక్షణ అవసరం. కుటుంబం నుంచి ప్రోత్సహాం లభించిన వారు శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి రాణిస్తున్నారు. ఇంకా కొందరైతే ఇంట్లో భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతల భారంతో బయటకు రాలేకపోతున్నారు. నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నా కుటుంబ భారం మోస్తూ అలాగే ఉండి పోతున్నారు. అయితే ఇలాంటి వారి కోసం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఓ కోత్త కార్యక్రమాన్ని రూపోందించింది. వారి ఇంటికో, గ్రామానికో వెళ్లి అక్కడే స్వయం ఉపాధి కార్యక్రమాల్లో శిక్షణ అందిస్తుంది.

సర్వే చేపట్టి.. కోర్సులు రూపొందించి

గృహ విజ్ఞాన విభాగం సహాయ శాస్త్రవేత్త సుగంధి కేవీకే పరిధిలో గ్రామాల్లో ప్రత్యేకంగా సర్వే చేపట్టారు. మహిళ ఆసక్తి, అభిరుచిని తెలుసుకొని అందకనుగుణంగా కొన్ని కోర్సులను రూపొందించారు. పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌, ఎంబ్రాయిండరీ, పెయింటింగ్‌, చీరల రోలింగ్‌, బ్లౌజ్‌ల డిజైనింగ్‌లో నిపుణులతో శిక్షణ అందిస్తారు. తర్వాత వారు ఉపాధి పొందేందుకు అవసరమైన రుణం పొందేందుకు సహాయం చేస్తారు. గ్రామంలో 25 నుంచి 30 మంది మహిళలు జట్టుగా ఏర్పడి కేవీకేలో నమోదు చేసుకుంటే చాలు. ఈ శిక్షణ కార్యక్రమాలు వారం నుంచి 15 రోజుల వ్యవధి ఉంటాయి. ఈ కార్యక్రమం అగ్రికల్చర్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆర్థిక సహకారంతో నడుస్తుంది.

గ్రామాల్లో మంచి స్పందన

నూతన విధానానికి గ్రామాల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ వైపు మహిళలు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. చిలుకూరు, నేరేడుచర్ల మండలం పెంచికలదిన్నె, పెన్‌పహాడ్‌ మండలం లింగాల, తుంగతుర్తి మండలం సంగెం గ్రామాలలో పుట్టగొడుగుల తయారీపై శిక్షణ అందించారు. పెంచికలదిన్నెలో గ్రూపునకు శిక్షణ ఇవ్వనున్నారు. చిరు ధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో పిండి వంటకాలు, బలవర్థక ఆహారం తయారీపై శిక్షణ ఇచ్చారు. సభ్యులంతా ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారు. పెంచికలదిన్నెలో శిక్షణ ఇవ్వడానికి సన్నద్దమవుతున్నారు.


గ్రామాలకు వెళ్తున్నాం..

సుగంధి, శాస్త్రవేత్త, కేవీకే

మహిళల ఆసక్తి తగ్గట్లుగా శిక్షణ కార్యక్రమాలు రూపొందించాం. ఆయకట్టు ప్రాంతాల్లో మహిళలు బయటకు వచ్చేందుకు సమయం ఉండదు. అందుకే మేమే గ్రామాలకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. శిక్షణ పొందిన వారు ఇంటి దగ్గరే ఉపాధి పొందుతున్నారు.


పుట్టగొడుగులు పెంచుతున్నా..

మేకల సావిత్రి, పెంచికల్‌దిన్న

కేవీకే శిక్షణతో పుట్టగొడుగుల తయారీ చేస్తున్నా. దీని ఇంట్లోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నాం. మిర్యాలగూడలోని హోటళ్లు, రెస్టారెంట్లు సరఫరా చేస్తున్నా. వారే ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు. పెద్ద మొత్తంలో కావాలన్న ముందస్తుగా ఆర్డర్‌ ఇస్తే తయారు చేస్తాం. స్వయంగ ఉపాధితో ఆదాయం వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని