logo

ఉద్యమ కలానికి పట్టం

నెహ్రూ మరణ వార్త విన్న వేణు సంకోజు తన ఆవేదనను అక్షర రూపంగా మలిచారు. అప్పటి నుంచి కవితలపై ఆసక్తి పెంచుకున్నారు. తొలి, మలి దశ ఉద్యమంలో తెలంగాణ అస్థిత్వం కోసం ఎన్నో రచనలు చేశారు. ఉద్యమ సమయంలో

Updated : 21 Jul 2022 06:54 IST

దాశరథి పురస్కారానికి వేణు సంకోజు ఎంపిక

నీలగిరి, మోత్కూరు- న్యూస్‌టుడే: నెహ్రూ మరణ వార్త విన్న వేణు సంకోజు తన ఆవేదనను అక్షర రూపంగా మలిచారు. అప్పటి నుంచి కవితలపై ఆసక్తి పెంచుకున్నారు. తొలి, మలి దశ ఉద్యమంలో తెలంగాణ అస్థిత్వం కోసం ఎన్నో రచనలు చేశారు. ఉద్యమ సమయంలో సాహిత్యపరంగా ఆయన చేసిన సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాదికి ప్రజా కవి దాశరథి కృష్ణామాచార్య పురస్కారానికి నల్గొండ జిల్లాకు చెందిన కవి రచయిత, విశ్రాంత అధ్యాపకుడు వేణు సంకోజును ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాశరథి జయంతి సందర్భంగా ఈ నెల 22న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పురస్కారం కింద ఆయనకు రూ.1,01,116 అందజేయనున్నారు.

నల్గొండ జిల్లా చండూరుకు చెందిన వేణు సంకోజు విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. ఎంఏ రాజనీతి శాస్త్రంలో ఎంఫిల్‌ పూర్తి చేశారు. డిప్లొమా ఇన్‌ జర్నలిజం చేశారు. 1969 ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. తొలి సంపుటి ‘‘మనిషిగా పూచే మట్టి’’ని 1995లో కాళోజీ నారాయణరావు ఆవిష్కరించారు. ఉద్యమ సమయంలో, కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి నెలా కాళోజీ రచనలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.  తెలంగాణ రచయితల సంఘం ప్రారంభించారు. సాహిత్య కార్యక్రమాలు తన ఇంట్లో నిర్వహించారు. నవ రచయితలకు మెలకువలు చెబుతూ ప్రోత్సహించారు. విద్యార్థులకు సాహిత్యం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమంలో సాహిత్య సాంస్కృతిక రంగాలను ఏకం చేస్తూ ప్రత్యేక భూమిక పోషించారు. అధ్యాపకుడిగా పనిచేస్తూనే 12 పుస్తకాలు రాసి అచ్చు వేయించారు. వివిధ సాహితీ సంస్థలకు మార్గ దర్శనం చేస్తూ రచయితలకు అండగా నిలిచారు. సాహిత్యంపై అభిరుచి ఉన్న విద్యార్థులను రచయితలుగా ప్రోత్సహిస్తూ వారు రాసిన కవితలతో ‘చలనం’ ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు.

ఆనందంగా ఉంది -వేణు సంకోజు

గొప్ప కవి దాశరథి కృష్ణామాచార్య అవార్డును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. దాశరథి గొప్ప స్థాయి కలిగిన వ్యక్తులు. ఆయన పేరు మీద రావడం సంతోషంగా ఉంది. చిన్నతనం నుంచే దాశరథి, సి.నారాయణరెడ్డి కవిత్వాలు ఆకర్షించాయి. కవి అంటే ఎలా ఉండాలో వారు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సృజనాత్మకతకు, సంస్కృతికి తగిన గౌరవం ఇచ్చింది. సాంస్కృతిక పరమైన పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ప్రతి రోజు కవితలు రాస్తాను. అవి రాశాకే భోజనం చేస్తాను.

ఆవిష్కరణలు.. రచనలు

* తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల రచనల సిలబస్‌ రచన కమిటీ సభ్యుడిగా కీలక భూమిక పోషించారు. తెలుగు అకాడమీ ప్రచురించే ఇంటర్మీడియట్‌, డిగ్రీ తరగతుల కోసం పాఠ్యాంశాల రచనలు చేశారు.

* 1984లో ‘‘జయమిత్ర’’ సాహిత్య సాంస్కృతిక వేదిక స్థాపించారు. ఆ సంస్థ ద్వారా 100కుపైగా రచనలు ప్రచురించడమే కాకుండా 150 పుస్తకాలను ఆవిష్కరించారు. వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.

* 1995లో తొలి సంపుటి ‘మనిషి పూచే మట్టి’ని కాళోజీ నారాయణరావు ఆవిష్కరించారు.

* 2001లో మనం కవితా సంపుటిని ఆవిష్కరించారు.

* 2008లో నేల కల, ప్రాణప్రదమైన, సర్శ కథల సంపుటి

* సుద్దాల హనుమంతు జీవిత చరిత్ర పుస్తకాన్ని రచించారు.

* విద్యార్థులతో ‘చలనం’ అనే కథా సంపుటిని తీసుకొచ్చారు.

* తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సేవా పురస్కారం. కాళోజీ శతజయంతి ఉత్సవాల్లో కాళోజీ పురస్కారం లభించింది. ప్రస్తుతం దాశరథి కృష్ణామాచార్య అవార్ఢు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు