logo

వీఆర్‌వోలకు ప్రత్యేక బాధ్యతలు

ఇటీవల పురపాలికలకు నియమితులైన వీఆర్‌వోలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,242 వార్డు అధికారుల పోస్టులను ప్రకటించింది. వీటిలో 280 మాత్రమే భర్తీ చేయనుంది.

Published : 25 Sep 2022 06:26 IST

సూర్యాపేటలోని మున్సిపల్‌ కార్యాలయంలో శిక్షణలో పాల్గొన్న వీఆర్‌వోలు (పాత చిత్రం)

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: ఇటీవల పురపాలికలకు నియమితులైన వీఆర్‌వోలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,242 వార్డు అధికారుల పోస్టులను ప్రకటించింది. వీటిలో 280 మాత్రమే భర్తీ చేయనుంది. జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, సీనియర్‌ అసిస్టెంటు, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను ప్రకటించింది. కొత్తగా ఏర్పడిన పురపాలికల్లో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల్లోనూ వీఆర్‌వోలను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలోని వివిధ పురపాలికలకు 31 మందిని సర్దుబాటు చేశారు. అత్యధికంగా నేరేడుచర్లకు 10 మందిని సర్దుబాటు చేయగా హుజూర్‌నగర్‌లో ఇద్దరు నియమితులయ్యారు. వార్డు అధికారుల పోస్టులు మంజూరైనా, అన్నింటినీ ప్రస్తుతం భర్తీ చేయడం లేదు. పాత పురపాలికల్లో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల్లో వీఆర్‌వోలను నియమించింది.

నియామకం ఇలా

సూర్యాపేట పురపాలికలో 48 వార్డులు ఉన్నాయి. పూర్తిస్థాయిలో వార్డు అధికారులను నియమించలేదు. ఇక్కడికి సర్దుబాటైన ఆరుగురు వీఆర్‌వోలకు నలుగురిని జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమించారు. మిగతా ఇద్దరు సెలవులో ఉండటంతో వారికి విధులు కేటాయించలేదు.

కోదాడలో 35 వార్డులు ఉన్నాయి. ఇక్కడికి నలుగురు వీఆర్‌వోలను సర్దుబాటు చేశారు. ఇద్దరిని వార్డు అధికారులుగా, మరో ఇద్దరిని జూనియర్‌ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేశారు.

తిరుమలగిరిలో 15 వార్డులు ఉండగా 9 మందికి వార్డు అధికారులుగా, ముగ్గురికి జూనియర్‌ అసిస్టెంట్లుగా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పూర్తిస్థాయిలో వార్డు అధికారులు లేరు.

నేరేడుచర్లలో 15 వార్డులు ఉండగా పురపాలికకు 10 మంది వీఆర్‌వోలను కేటాయించారు. నలుగురికి జూనియర్‌ అసిస్టెంట్లుగా, ఆరుగురికి వార్డు అధికారులుగా కేటాయించారు. పూర్తిస్థాయిలో మాత్రం వార్డు అధికారులు లేరు.

హుజూర్‌నగర్‌లో 28 వార్డులు ఉన్నాయి. ఈ పురపాలికకు ఇద్దరు వీఆర్‌వోలను కేటాయించగా వారిని జూనియర్‌ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని