logo

అమ్మకు భరోసా..!

పదేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రతి లక్ష కాన్పులకు సుమారు వంద మంది వరకు బాలింతలు వివిధ ఆరోగ్యపరమైన కారణాలతో మృత్యువాత పడేవారు. దీంతో వారి పిల్లలు తల్లిలేక అనాథలుగా మారిపోయి.. పరిస్థితి దయనీయంగా ఉండేది.

Published : 02 Dec 2022 03:25 IST

తగ్గిపోతున్న మాతృ మరణాల సంఖ్య
మిర్యాలగూడ, న్యూస్‌టుడే

మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి ప్రసవాల వార్డులో బాలింతలు

పదేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రతి లక్ష కాన్పులకు సుమారు వంద మంది వరకు బాలింతలు వివిధ ఆరోగ్యపరమైన కారణాలతో మృత్యువాత పడేవారు. దీంతో వారి పిల్లలు తల్లిలేక అనాథలుగా మారిపోయి.. పరిస్థితి దయనీయంగా ఉండేది. ఏటా ఈ మరణాల సంఖ్య పెరుగుతూ పోతుండటంతో..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. పలు చర్యలు తీసుకుని వీటిని తగ్గించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ప్రభుత్వ కార్యక్రమాలతో..

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్యంపై దృష్టిసారించి పలు కార్యక్రమాలు రూపొందించింది. గ్రామాల్లో  ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో,అంగన్‌వాడీలతో మహిళలు గర్భం దాల్చిన సమాచారం పక్కాగా సేకరిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు ప్రతిరోజు గుడ్డు, పౌష్టికాహారం అందించే ఏర్పాటు చేశారు. గర్భం దాల్చినప్పటి నుంచి కనీసం మూడుసార్లు ఆసుపత్రిలో చూపించుకునేలా ఆశ కార్యకర్తలు పర్యవేక్షిస్తున్నారు.

*  కేసీఆర్‌ కిట్‌ పేరుతో రూపొందించిన పథకంతో మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లలు పుట్టి టీకాలు పూర్తి అయ్యేంత వరకు వివిధ దశల్లో రూ.12 వేలు (అబ్బాయిపుడితే), రూ.13 వేలు (అమ్మాయి పుడితే) చెల్లింపులు జరుపుతున్నారు. దీంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయిన వారికి కేసీఆర్‌ కిట్‌తో సామగ్రి ఇస్తుండగా శిశువులకు తగిన ప్రాథమిక సేవలు అందుతున్నాయి.

*  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా గర్భిణుల వివరాలు నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు. రక్తహీనత ఉన్నవారికి తగిన వైద్యసేవలు, మందులు ఇస్తున్నారు.

*   ఇళ్ల వద్ద  కాన్పులు చేయకుండా గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తున్నారు.

*  ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు ఆరోగ్య అవగాహన పెరగటం, కేసీఆర్‌ కిట్‌ , ఆర్థిక సాయం కారణంగా ఆసుపత్రుల్లోనే కాన్పులు అధికంగా జరుగుతున్నాయి. తల్లికి, శిశువుకు మెరుగైన వైద్యం అందిస్తున్నందున మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని నల్గొండ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి ఏ.కొండల్‌రావు తెలిపారు.

మాతా మరణాలకు కారణాలివే..

సరైన వైద్య సౌకర్యాలు లేకపోవటం, గ్రామ స్థాయిలో గర్భిణులు పౌష్టికాహారం తీసుకోక పోవటం, గ్రామాల్లో గర్భం దాల్చినప్పటి నుంచి తగిన రీతిలో వైద్యసేవలు అందించక పోవటం, పేదరికం కారణంగా ఆసుపత్రులకు వెళ్లలేక పోవటం, చాలా వరకు కాన్పులు ఇళ్లవద్దనే జరుగుతుండటం, మహిళలు 30 ఏళ్ల వయసు పైబడిన తరువాత గర్భం దాల్చుతుండటం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని