logo

వాడే ముందు జాగ్రత్త

రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు.

Published : 28 Mar 2024 05:12 IST

ఇటీవల కోదాడలో డ్రగ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించగా బయటపడిన కాలం చెల్లిన మందులు

రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. దీంతో సదరు వ్యక్తి కాలం చెల్లిన బ్యాండేజీ ఇచ్చారని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, వారు నిర్లక్ష్యం వహించారు. ఇదే విషయం జిల్లా డ్రగ్‌ అధికారులకు తెలియడంతో వారు తనిఖీలు నిర్వహించగా సుమారు రూ.12 లక్షల విలువైన మందులు పట్టుబడ్డాయి. వీటిలో అధికారుల అనుమతి లేని, కాలం చెల్లిన మందులు ఉన్నాయి.

కోదాడ, న్యూస్‌టుడే: కాలపరిమితి అయినపోయిన వస్తువును వాడితే వ్యర్థమే. అలాంటిది రోగం వస్తే కాపాడాల్సిన ఔషధాల్లో కూడా కాలం చెల్లినవి విక్రయిస్తున్న ఘటనలు ఉన్నాయి. ఆ మందులను వినియోగిస్తే రోగం తగ్గకపోగా అదనంగా మరింత అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఇటీవల కోదాడలో డ్రగ్‌ అధికారులు తనిఖీలు చేసి పలు దుకాణాల్లో సుమారు రూ.40 లక్షలకు పైగా విలువైన మందులను సీజ్‌ చేశారు. వీటిలో 70 శాతం మందులు కాలం చెల్లినవే కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని దుకాణాల్లో ఇలాంటి మందులు దొరికే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

చెరిపేసి విక్రయం: కొందరు ఆస్పత్రుల నిర్వాహకులు లేజర్‌ గన్‌ల ద్వారా మెడికల్‌ షీట్‌ మీద ఉన్న వివరాలు చెరిపేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రుల పరిధిలో నడిచే మెడికల్‌ దుకాణాల్లోనే ఇలాంటి వ్యవహారం ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఇచ్చే మందులను రోగులు వెంటనే వినియోగిస్తారనే నమ్మకంతోనే ఈ వ్యవహారం గుట్టుగా జరుగుతోంది.

కాలం చెల్లిన మందులు గ్రామాల్లోకి

కాలం చెల్లిన మందులు పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఆర్‌ఎంపీ వైద్యుల్లో ఎక్కువగా ఈ మందులనే వాడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో రెండు రకాల మందులు ఉంటాయని, కొనే వారిని బట్టి అమ్మకాలు ఉంటాయనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణాల్లో నివసించే ప్రజలకు మెడిసిన్‌ చివరి తేదీ చూసి ఇస్తారు. గ్రామాల్లో ప్రజలకు ఈ వ్యవహారం తెలియక ఆ మందులు వాడే అవకాశం ఉంది.


కఠిన చర్యలు తీసుకుంటాం
దాసు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డ్రగ్‌ కంట్రోల్‌ డిపార్టుమెంట్‌, ఉమ్మడి నల్గొండ

ఇటీవల కోదాడ పట్టణంలో తనిఖీలు నిర్వహించగా పలు దుకాణాలల్లో కాలం చెల్లిన మందులు దొరికాయి. కాలం చెల్లిన మందులు విక్రయించి ప్రజల ప్రాణాల ముప్పునకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దుకాణాల్లో కాలం చెల్లిన మందులు విక్రయిస్తే స్థానికులు నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని