logo

నీడలా.. నిఘా!

ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ముఖ్యమైనది. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటిస్తున్నారా..

Published : 16 Apr 2024 03:10 IST

లోక్‌సభ ఎన్నికల పర్యవేక్షణకు తనిఖీ బృందాలు

సూర్యాపేట పట్టణంలోని జనగామ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

భానుపురి, సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ముఖ్యమైనది. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటిస్తున్నారా.. లేక ఉల్లంఘనలకు ప్పాలడుతున్నారా? అని పర్యవేక్షణ చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ బృందాలు పటిష్ఠంగా పనిచేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ బృందాలను వినియోగించుకోనున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఎంసీసీ, వీడియో సర్వేలైన్స్‌, స్టాటిస్టిక్‌ సర్వేలైన్స్‌, వీడియో వ్యూయింగ్‌, మీడియా కో-ఆర్డినేషన్‌ మానిటరింగ్‌, అకౌంటింగ్‌ బృందాలను ఎన్నికల సంఘం నియమించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల నిబంధనలు విస్మరించి తరలిస్తున్న డబ్బులను ఈ తనిఖీ బృందాలు పట్టుకున్నాయి. ఎన్నికల నియమావళికి లోబడి ఉన్నారా.. ఖర్చులు ఏ స్థాయిలో చేస్తున్నారు. ఓటర్లకు మద్యం, డబ్బులు రవాణా చేస్తున్నారా.. ఇలా అన్ని కోణాలపై దృష్టిసారించాయి. లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలను ఈ బృందాలు నీడలా వెంటాడుతున్నాయి.


పని తీరు ఇలా..

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌: మూడు ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముఖ్య శాఖ అధికారి, ఒక పోలీస్‌ అధికారి, ఒక వీడియోగ్రాఫర్‌ ఉంటారు. ఓటర్లను మభ్యపెట్టడానికి డబ్బు, మద్యం పంపిణీని నియంత్రించేందుకు ఈ బృందం పని చేస్తుంది. రోజువారి వివరాలను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు ఈ బృందంలో ఉన్నతాధికారికి వివరిస్తారు.
ఎంసీసీ: ప్రతి మండలానికి ఒక మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌(ఎంసీసీ) బృందాన్ని నియమించారు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఈ బృందాలు పనిచేస్తున్నాయి. ఇందులో ముగ్గురు అధికారులు ఉంటారు. బృంద బాధ్యుడిగా ఒక గెజిటెడ్‌ అధికారిని నియమించారు. ఒక పోలీస్‌ అధికారి, వీడియోగ్రాఫర్‌ ఉన్నారు. పార్టీ అభ్యర్థుల ప్రచారాలు, ఖర్చులపై వీరు నిఘా పెట్టారు. అన్ని వివరాలను రోజూ రిటర్నింగ్‌ అధికారి తెలుపుతున్నారు.
వీడియో సర్వేలెన్స్‌: ప్రతి నియోజకవర్గానికి రెండు వీడియో సర్వేలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో రెవెన్యూ, పోలీస్‌ అధికారితోపాటు వీడియోగ్రాఫర్‌ ఉన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలపై వీరు దృష్టిపెడుతున్నారు. ప్రతి అంశాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు.
మీడియా కో- ఆర్డినేషన్‌ మానిటరింగ్‌: మీడియా కో-ఆర్డినేషన్‌ మానిటరింగ్‌ బృందం దినపత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్‌ ఆర్టికల్స్‌కు పార్టీల అభ్యర్థులు లేదా పార్టీలు చేసే ఖర్చులను లెక్కకడుతుంది. ఈ వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి నిత్యం రిటర్నింగ్‌ అధికారికి అందజేస్తారు.
అకౌంటింగ్‌: ప్రతి నియోజకవర్గానికి ఒక అకౌంటింగ్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ట్రెజరీ లేదా బ్యాంకు అధికారి బృంద సభ్యుడిగా ఉన్నారు. ఇతర శాఖకు చెందిన ఒకరు సహాయ అధికారిగా పని చేస్తారు. రోజూ అభ్యర్థుల ఖర్చుల వివరాలు ఈ బృందం లెక్కగడుతుంది. ఈ బృందం రోజువారి రిటర్నింగ్‌ అధికారికి అందజేస్తుంది.


స్టాటిస్టిక్‌ సర్వేలెన్స్‌

ఎనిమిది మందితో ఉన్న ఈ బృందం డబ్బు, మద్యం తరలింపుపై దృష్టి సారిస్తుంది. ఈ బృందానికి డిప్యూటీ తహసీల్దార్‌ బాధ్యుడిగా వ్యవహరిస్తారు. నలుగురు పోలీసు అధికారులు, ఒకరు అటవీశాఖ అధికారి, ఆబ్కారీశాఖ అధికారి ఒకరు, వీడియోగ్రాఫర్‌ ఒకరు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో మూడు స్టాటిస్టిక్‌ సర్వేలెన్స్‌ బృందాలను నియమించారు.


వీడియో వ్యూయింగ్‌

వీడియో సర్వేలెన్స్‌ బృందం ద్వారా వచ్చిన వీడియోలను నిశితంగా పరిశీలన చేయడానికి వీడియో ప్యూయింగ్‌ బృంద సభ్యులు పనిచేస్తున్నారు. నియోజకవర్గానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక గెజిటెడ్‌ అధికారితో పాటు ఇద్దరు సహాయకులుగా ఉన్నారు. వీడియోలో కోడ్‌ ఉల్లంఘనులను గుర్తించి రిటర్నింగ్‌ అధికారికి అందజేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని