logo

అక్రమాలపై కన్ను..!

కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకోవడంతో పాటూ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి సకాలంలో ఇవ్వాల్సిన సీఎంఆర్‌ బియ్యాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న మిల్లులపై అధికారులు కొరడా ఝులిపించారు.

Published : 17 Apr 2024 06:31 IST

సూర్యాపేట జిల్లాలోని పలు మిల్లుల్లో అధికారుల సోదాలు

తిరుమలగిరిలోని ఓ రైస్‌మిల్లులో సూర్యాపేట అదనపు కలెక్టర్‌ ప్రియాంక ఆధ్వర్యంలో తనిఖీలు జరుపుతున్న అధికారుల బృందం

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, హుజూర్‌నగర్‌ : కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకోవడంతో పాటూ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి సకాలంలో ఇవ్వాల్సిన సీఎంఆర్‌ బియ్యాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న మిల్లులపై అధికారులు కొరడా ఝులిపించారు. సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగం, విజిలెన్స్‌ అధికారులు సంయుక్తంగా మిల్లుల్లో అక్రమాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న తిరుమలగిరి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, గరిడేపల్లి, తుంగతుర్తిలోని సుమారు 15 మిల్లులపై మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇందులో సీఎంఆర్‌ బియ్యంతో పాటూ పలు మిల్లుల్లోని రికార్డుల్లో తప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కొంత మంది మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సుమారు రూ.300 కోట్ల మేర బియ్యం చెల్లింపుల్లో అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారని కొంత మంది రాష్ట్ర ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు చేయడంతో.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన కలెక్టరు వెంకట్‌రావు..గతం నుంచి పలు ఆరోపణలు ఉన్న మిల్లులపై దాడులు నిర్వహిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణలో విజిలెన్స్‌, పౌరసరఫరాలు, జిల్లా అధికార యంత్రాంగం అందరూ సంయుక్తంగా ఇంత పెద్ద మొత్తంలో ఏకకాలంలో దాడులు చేయడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్‌ బియ్యం చెల్లింపుల్లో గతం నుంచి సూర్యాపేట జిల్లా అట్టడుగు స్థాయిలోనే ఉంది. సీఎంఆర్‌ బియ్యం చెల్లింపుల్లో అక్రమాలపై ఈ నెల 15న ఈనాడులో ‘మారని తీరు...మరాడించరు వారు’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.

అదుపులో మిల్లర్ల సంఘ నాయకుడు..!

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వందల రూ.కోట్ల విలువైన బియ్యం ఎగవేతతో పాటూ తాజా యాసంగి సీజన్‌లో తన, బినామీలకు చెందిన సుమారు నాలుగు మిల్లుల్లో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తీసుకోకుండా ప్రయత్నాలు చేసిన జిల్లాకు చెందిన మిల్లర్ల సంఘం కీలక నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు మిల్లుల్లో కలిపి సదరు నేత సుమారు రూ.200 కోట్ల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని సమాచారం. భారీగా బకాయిలతో పాటూ తాజా సీజన్‌లో అధికారులకు సహకరించకుండా ఉండటంతో జిల్లా అధికారులు సైతం రాష్ట్ర పెద్దలకు సమాచారం ఇవ్వడంతో హైదరాబాద్‌ కేంద్రంగా ఓ కీలక నాయకుడి ఆదేశంతో సదరు నేతను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో అధికార యంత్రాంగంతో పాటూ విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నట్లు తెలిసింది. అయితే సదరు నేతతో అంటకాగిన అధికారులు, నేతలు ఎవరనే దానిపైనా ఆరా తీస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ అక్రమాలపై విజిలెన్స్‌ కేసులు నమోదు చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. సదరు నాయకుడితో పాటూ గరిడేపల్లి, నేరేడుచర్ల, తిరుమలగిరి, తుంగతుర్తి, సూర్యాపేట గ్రామీణ మండలాల్లో అక్రమాలకు పాల్పడిన మిల్లులపైనా తీవ్ర చర్యలకు అధికారులు సిఫార్సులు చేస్తున్నారు. నాలుగైదేళ్ల పాటు ఇక్కడ పనిచేసిన ఓ అధికారి వత్తాసుతోనే సదరు నాయకుడు రూ.కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించారని గతంలోనే ఆరోపణలు రాగా...హైదరాబాద్‌ స్థాయిలో పైరవీ ద్వారా వీటన్నింటినీ బహిర్గతం కాకుండా చూశారు. గతంలో బ్లాక్‌లిస్టులో పెట్టి తిరిగి ధాన్యం కేటాయింపులు చేస్తున్న మిల్లుల్లోనూ రికార్డులు అధికారులు సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు.

‘హైదరాబాద్‌ స్థాయిలో ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆదేశంతోనే ఈ తనిఖీలు చేపడుతున్నాం. పలు మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు పక్కా ఆధారాలు లభించాయి. మరికొన్ని రోజుల పాటూ తనిఖీలు చేసి ఉన్నతాధికారుల సూచనతో తదుపరి చర్యలు తీసుకుంటా’మని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని