logo

లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్‌ గల్లంతు: ఉత్తమ్‌

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 20 Apr 2024 04:36 IST

సూర్యాపేటలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిత్రంలో లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, తదితరులు

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో శుక్రవారం రాత్రి జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇరవై మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భారాసలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని విమర్శించారు. త్వరలోనే 25 మంది భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పదేళ్ల భారాస అరాచక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రాష్ట్రానికి భాజపా చేసింది శూన్యమని, ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ 14 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులమంతా కలిసి కట్టుగా పనిచేసి రఘువీర్‌రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గంలో 40 వేల మెజార్టీ సాధిస్తామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. పటేల్‌ రమేశ్‌రెడ్డికి తనకు ఎలాంటి విభేదాలు లేవని.. కార్యకర్తలూ అర్థం చేసుకోవాలని కోరారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పటేశ్‌ రమేశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్‌, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, కొప్పుల వేణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పటేల్‌ వర్గీయుల ఆందోళన... వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పటేల్‌ రమేశ్‌రెడ్డి ఫొటో కనిపించకపోవడంతో ఆయన వర్గీయులు సభా వేదిక ముందు ఆందోళనకు దిగారు. కార్యక్రమానికి ఆహ్వానం సైతం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. సంయమనం పాటించాలని మాజీ మంత్రి జానారెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని