logo

రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్‌ ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 05 May 2024 04:38 IST

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పానీపూరి తింటున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన రైతుబంధునే కొనసాగించారని, రాష్ట్రంలో ఒక్కరికీ రైతు భరోసా ఇచ్చినట్లు నిరూపించినా.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముక్కునేలకు రాస్తానని చెప్పారు. నల్గొండ లోక్‌సభ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల నియమావళి పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి అర్హులందరికీ రైతుబంధు అందజేసి, ఐదు నెలల ఆలస్యానికి కర్షకులందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నాయకుల తరహాలో తాము ఎన్నికల కమిషన్‌కు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. కేసీఆర్‌ సిద్ధం చేసి పెట్టిన రూ.750 కోట్ల రైతుబంధు నిధులను డిసెంబరు 9న అన్నదాతలకు ఇవ్వకుండా గుత్తేదార్లకు పంచిపెట్టారని ఆరోపించారు. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు ఛాలెంజ్‌ చేయడానికి సిగ్గుపడాలన్నారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని