logo

ఆర్టీసీ బస్టాండ్‌లు.. చోరీలకు అడ్డాలు!

మిర్యాలగూడ పట్టణం చింతపల్లి కాలనీకి చెందిన ఓ మహిళ తన బంగారాన్ని బ్యాగులో వేసుకుని ఊరికి వెళ్లేందుకు స్థానిక బస్టాండ్‌లోని నల్గొండ ప్లాట్‌ఫాం వద్ద ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బస్సెక్కింది.

Published : 06 May 2024 02:49 IST

మిర్యాలగూడ బస్టాండ్‌లో నేలచూపులు చూస్తున్న నిఘా నేత్రం

మిర్యాలగూడ పట్టణం చింతపల్లి కాలనీకి చెందిన ఓ మహిళ తన బంగారాన్ని బ్యాగులో వేసుకుని ఊరికి వెళ్లేందుకు స్థానిక బస్టాండ్‌లోని నల్గొండ ప్లాట్‌ఫాం వద్ద ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బస్సెక్కింది. బస్సెక్కిన తర్వాత బ్యాగు జిప్‌ కొద్దిగా తెరచి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా.. బంగారం ఉన్న చిన్న పర్సు చోరీకి గురైనట్లు గుర్తించి లబోదిబోమంది. ఆ వెంటనే ఓ వ్యక్తి పర్సు, మరో వ్యక్తి సెల్‌ఫోన్‌ సైతం చోరీకి గురయ్యాయి. ఇటువంటి ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం అనేకం చోటు చేసుకుంటున్నాయి.

మిర్యాలగూడ పట్టణం, నల్గొండ నేర విభాగం, న్యూస్‌టుడే: అవి నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రాంగణాలు. వారి ద్వారా నిత్యం లక్షల్లో ఆదాయం. అయినా వారి రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోని వైనం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు ఆర్టీసీ డిపోలు ఉండగా.. వీటి పరిధిలో నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, యాదగిరిగుట్ట ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం వేలాది మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. అయితే ఆయా బస్టాండ్లలో  దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుండడంతో ప్రయాణికులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమ రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

పని చేయని నిఘా నేత్రాలు..

ఆర్టీసీ బస్టాండ్లలో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లోపంతో పని చేయకుండా అలంకారప్రాయంగా మారాయి. దీంతో దొంగతనాలు జరిగినప్పుడు కేసులను ఛేదించడం పోలీసులకు సవాలుగా మారుతుంది. దీంతో కేసులు తేలేది లేదు.. చోరీకి గురైన సొమ్ము తిరిగి వచ్చేది లేదని ప్రయాణికులు వాపోతున్నారు. సీసీ కెమెరాల నిర్వహణ మాది కాదంటే మాది కాదని.. ఆర్టీసీ, పోలీస్‌ శాఖలు తప్పించకుంటుండడంతో దొంగలకు పని సులభంగా మారుతోంది. మిర్యాలగూడ బస్టాండ్‌లో దుకాణదారులు చందాలు వేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా నిర్వహించే నాథుడు లేక మూలన పడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని బస్టాండ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

బస్టాండ్లలో జరిగిన దొంగతనాలు మచ్చుకు కొన్ని..

  • నల్గొండ బస్టాండ్‌లో గడచిన 20 రోజుల్లో 15 సెల్‌ ఫోన్లు చోరీకి గురయ్యాయి.
  • గతేడాది నవంబరులో నార్కట్‌పల్లి నుంచి నల్గొండ వస్తున్న బస్సులో ఓ మహిళ బ్యాగులోని 8 తులాలకు పైగా బంగారు ఆభరణాలను మహిళా దొంగలు అపహరించారు.
  • గతేడాది మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో వరుసగా ఐదు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి.
  • మూడేళ్ల క్రితం మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన అద్దె బస్సుల్లో డీజిల్‌ చోరీకి గురైంది.

ప్రతిపాదనలు పంపిస్తాం

బొల్లెద్దు పాల్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌, మిర్యాలగూడ

బస్టాండ్‌లో గతంలో దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణను పోలీస్‌ శాఖకు అప్పగించాం. ప్రస్తుతం సీసీ కెమెరాలు మరమ్మతులకు గురయ్యాయి. సంస్థ నుంచి నిధులు రాలేదు. త్వరలోనే సీసీ కెమెరాల ఏర్పాటుకై స్థానిక ఎమ్మెల్యేతో పాటు సంస్థ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని