logo

వ్యర్థాలకు నిప్పు.. భూసారానికి ముప్పు

యాసంగి సీజన్‌ పూర్తి అయిన నేపథ్యంలో రైతులు తమ పొలాలను యంత్రాలతో కోసిన తరువాత మిగిలిన వరికొయ్యలను తగులబెడుతున్న తీరుతో.. ఓ వైపు భూమిలోని పోషకాలు కరిగిపోవటంతో పాటు.. మరోవైపు వాతావరణంలో కాలుష్యానికి కారణమై తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం నెలకొంది.

Published : 06 May 2024 02:51 IST

ఐలాపురం వద్ద వరికొయ్యలు కాల్చటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిన ప్రాంతం

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: యాసంగి సీజన్‌ పూర్తి అయిన నేపథ్యంలో రైతులు తమ పొలాలను యంత్రాలతో కోసిన తరువాత మిగిలిన వరికొయ్యలను తగులబెడుతున్న తీరుతో.. ఓ వైపు భూమిలోని పోషకాలు కరిగిపోవటంతో పాటు.. మరోవైపు వాతావరణంలో కాలుష్యానికి కారణమై తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు యాసంగి కోతలు పూర్తి కావటంతో తమ పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. దీని కారణంగా భూమిలో ఆర్గానిక్‌ కార్బన్‌ మంటల్లో కరిగిపోయి వాతావరణంలో ఇంకిపోతుంది. దీంతో భూమిలో కర్బనశాతం పూర్తిగా తగ్గిపోయి తిరిగి పంటలు పండేందుకు అవసరమైన సారం లేకపోవటంతో రైతులకు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మంటల కారణంగా వ్యాపించే పొగతో కార్బన్‌డయాక్సైడ్‌ వెలువడి వాతావరణంలో కలిసిపోతుండగా.. ఈ గాలి పీల్చిన వారు దిల్లీ తరహా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడే దుస్థితి నెలకొంది. జిల్లాలోని సాగర్‌ ఆయకట్టులో పలుచోట్ల రైతులు వరికొయ్యలకు నిప్పుపెడుతున్నారు. వానాకాలం సీజన్‌లో వర్షాలు కురిసిన వెంటనే ట్రాక్టర్లతో భూమిని దున్నించుకోవచ్చనే ఉద్దేశంతో రైతులు ఈ తరహా పనులు చేస్తున్నారు.  మూడు రోజుల క్రితం మిర్యాలగూడ మండలం ఐలాపురం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వరికొయ్యలకు నిప్పు పెడితే పక్కనే ఉన్న పిచ్చి మొక్కలు అంటుకుని రైల్వేట్రాక్‌ వరకు వ్యాపించి గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది. దీనిపై ఆర్డీవో, డీఎస్పీ మిర్యాలగూడలో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి రైతులు కొయ్యలు కాల్చవద్దంటూ ఆదేశాలు జారీచేశారు.

పంట కొయ్యలు కాల్చొద్దు

పోరెడ్డి నాగమణి, ఏడీఏ, మిర్యాలగూడ

రైతులు వరి పొలం కోసిన తరువాత మిగిలి ఉన్న కొయ్యలను కాల్చకుండా ఉంచాలి. వీటిని వర్షాలు కురిసిన తరువాత దున్నితే పొలానికి అవసరమైన సారం పెరిగే అవకాశం ఉంది. దీనిపై కింది స్థాయిలో వ్యవసాయ సిబ్బందితో రైతులకు అవగాహన కల్పించి గ్రామాల్లో డప్పు చాటింపులు చేయించేలా ఏర్పాటు చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని