logo

ఫిర్యాదు వచ్చిందా.. చిటికెలో పరిష్కారం

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతం చేయడంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లు కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు సైతం అందుకున్నారు.

Published : 08 May 2024 03:38 IST

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

చివ్వెంల మండలంలోని ఓ గ్రామంలో ఓ పార్టీ నాయకుడి ఇంటికి బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసుకోగా దీనిపై మరో పార్టీ నాయకులు వారం క్రితం కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేశారు. సిబ్బంది వెంటనే నోడల్‌ అధికారికి ఈ విషయం తెలియజేయగా ఆయన ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి, పోలీస్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు అక్కడికి వెళ్లి బ్యానర్లు, పోస్టర్లు తొలగింపజేశారు.


సూర్యాపేటలో మూడు రోజుల క్రితం ఓ పార్టీకి చెందిన వారు రాత్రి పది గంటల తరువాత కూడా వాహనం ద్వారా మైకులతో పాటల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకున్న ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందం ప్రచారం వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి పంపించింది.

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతం చేయడంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లు కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు సైతం అందుకున్నారు. ఇదే స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికలనూ జరిపేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన 1950 కాల్‌సెంటర్‌, సీ విజిల్‌ యాప్‌ కేంద్రంలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. కంట్రోల్‌ రూంకు వచ్చిన ప్రతి ఫిర్యాదును సిబ్బంది వెంటనే నమోదు చేసుకుని సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నారు. 24 గంటల్లో పరిష్కరించేలా చొరవ తీసుకుంటున్నారు. పరిష్కరించకుంటే ఎందుకు చేయలేకపోయారో రోజూ నివేదికలో పొందుపరుస్తున్నారు.

1950 కాల్‌సెంటర్‌లో విధులు..

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూముల్లో సిబ్బంది మూడు విభాగాల్లో నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఓటు ఎక్కడుందో తెలుసుకోవడం, ఓటరు జాబితాలో తమ పేరు లేకపోయినా, ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులవి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు ఉన్నా వాటిని మార్పించేందుకు 1950 కాల్‌ సెంటర్‌ ఉపయోగపడుతుంది. ఈ నెంబర్‌ను సమాచారం అందించినట్లయితే సంబంధిత బీఎల్వోలకు సమాచారం చేరవేసి పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటున్నారు.

సీ విజిల్‌ యాప్‌..: అనుమతులు లేకుండా స్పీకర్ల వినియోగం, ఇళ్ల ఎదుట బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసినట్లయితే సీ విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేయాలి. వాటిని సదరు సిబ్బంది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందానికి చేరవేస్తారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లను బెదిరించడం వంటివి చేస్తే ఫొటోలు, రికార్డులు, ఇతర ఆధారాలతో సీ విజిల్‌ యాప్‌లో నమోదు చేయాలి. వెంటనే ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌లు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నారు.

సువిధ యాప్‌..: ప్రచారాల్లో భాగంగా సమావేశాలు, సభల అనుమతుల కోసం సువిధ యాప్‌ ద్వారా అనుమతులు ఇస్తున్నారు. దరఖాస్తుల్లో సరైన కారణాలు చూపకపోవడంతో ఈ ఎన్నికల్లో 291 ఫిర్యాదుల్లో 87 తిరస్కరించగా, 20 రద్దు కాగా, నాలుగు పరిశీలనలో ఉన్నాయి. 180 దరఖాస్తులను పరిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు