logo

ప్చ్‌.. అవగాహన లేకనే

చదువులకు జిల్లా పెట్టింది పేరు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి చదువుతుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. జిల్లా నుంచి ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లే పేదల సంఖ్య తక్కువగా ఉంటోంది.

Published : 06 Feb 2023 02:19 IST

ఎనిమిది మందికే సాయం
నాలుగేళ్ల తర్వాత విదేశీ చదువులకు పథకం అమలు
న్యూస్‌టుడే, నెల్లూరు (సంక్షేమం)

మైపాడులో విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థి వివరాలను
తెలుసుకుంటున్న బీసీ సంక్షేమశాఖ అధికారి వెంకటయ్య (పాతచిత్రం)

చదువులకు జిల్లా పెట్టింది పేరు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి చదువుతుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. జిల్లా నుంచి ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లే పేదల సంఖ్య తక్కువగా ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలో ఏటా ప్రతిభావంతులకు అవకాశాలు లభించగా.. 2019 నుంచి ఆ పథకం పూర్తిస్థాయిలో ఆగిపోయింది. ఈనెల 3వ తేదీన ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో 8 మంది విద్యార్థులకు తొలి విడత నిధులను ఇటీవల మంజూరు చేసింది.

ఏడాదికి నాలుగు విడతల్లో నిధులు

విదేశీ విద్యా దీవెన కింద ఏడాదికి నాలుగు విడతల్లో నిధులు మంజూరు చేయనుంది. వివిధ దేశాల్లో 200 యూనివర్సిటీలను ఎంపిక చేసి వాటిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ పథకం అమలు చేయనుంది. గుర్తించిన వంద విశ్వవిద్యాలయాల్లో స్థానం పొందిన విద్యార్థులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్లు, వంద నుంచి 200 యూనివర్సిటీలకు ఎంపికైన విద్యార్థులకు రూ.కోటి వరకు లేదా మొత్తం ఫీజును చెల్లించనుంది. విమాన, వీసీ ఛార్జీలు కూడా భరించనుంది. ఒక్కో సెమిస్టర్‌ మార్కులు అప్‌లోడ్‌ చేసిన విద్యార్థులకు ఈ నిధులు మంజూరు చేయనుంది.

మొన్నటివరకు ఊసేలేదు..

2019కు ముందు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్‌ ఓవర్‌సిస్‌ విద్యా నిధి పథకం కింద విదేశాల్లో చదివే అవకాశాన్ని కల్పించింది. మైనార్టీలకు ఓవర్‌సిస్‌ విద్యా పథకం కింద, బీసీలకు ఎన్టీఆర్‌ విదేశీ విద్య కింద విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించింది. సాంఘిక సంక్షేమశాఖలో 2013-14లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ఎస్సీలకు ప్రవేశ పెట్టింది. తొలుత రూ.2 లక్షల లోపు సంవత్సర ఆదాయమున్న వారు దరఖాస్తు చేసేవారు. 2015-16లో దీన్ని రూ.6 లక్షలకు పెంచారు. ప్రస్తుతం రూ.8 లక్షల కుటుంబ సంవత్సర ఆదాయం నిర్ణయించారు. 2019కు ముందు అప్పట్లో ఏటా విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు.

ఉందో.. లేదో తెలియకనే..

2019కి ముందు వరకు అమల్లో ఉన్న విదేశీ విద్య పథకాలు నిలిపివేసి.. నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో తిరిగి ప్రారంభించింది. ఎక్కువ మందికి ఈ పథకం ఉందో, లేదో అవగాహన లేకపోవడంతో తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన దాదాపు 30 మందికి పైగా దరఖాస్తు చేయగా వీరిలో 8 మందిని ఎంపిక చేశారు. జ్ఞాన భూమి పోర్టల్‌లో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత జిల్లా స్థాయిలో ఆయా సంక్షేమ అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అధికారుల కమిటీ పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. జిల్లాలో ఎస్సీలో ఇద్దరు, బీసీలో ఒకరు, ఈబీసీల్లో ముగ్గురు, మైనార్టీల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి నిధులు మంజూరు చేసింది. వీరు విదేశాల్లో ఎంఎస్‌, ఎంబీబీఎస్‌, బయో ఇంజినీరింగ్‌ వంటి కోర్సులు చదవనున్నారు.


దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఆమోదిస్తాం

ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఈ పథకంతో అవకాశముంది. తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసి కలెక్టర్‌ ఆమోదంతో రాష్ట్రస్థాయికి పంపుతాం. వారు అన్ని రకాలుగా పరిశీలించి విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపిక చేస్తారు. ఏటా రెండు స్పెల్‌లో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

- వెంకటయ్య, బీసీ సంక్షేమశాఖ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని