logo

యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన

అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్‌ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

Published : 26 Apr 2024 05:21 IST

మహిళల నైపుణ్యానికి జగన్‌ మోకాలడ్డు
దుమ్ముపట్టిపోతున్న సామగ్రి

అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్‌ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెదేపా ప్రభుత్వం మహిళలకు భరోసాతోపాటు ఆర్థిక చేయూత కల్పించేలా కేంద్రాలు ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధికి దోహద పడితే.. జగన్‌ జమానాలో అవేమీ లేకుండా పోయాయి. కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

న్యూస్‌టుడే, నెల్లూరు (విద్య), కందుకూరు పట్టణం: నిరుపేద, నిరాదరణకు గురైన మహిళలు, వితంతువులకు ఆర్థిక చేయూత, స్వయం ఉపాధి కల్పనకు నెల్లూరు గాంధీనగర్‌లోని పది ఎకరాల స్థలంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని 1992, సెప్టెంబరు 16న నాటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంభించారు. ఇక్కడ వివిధ రకాల చేతి వృత్తులు, ఇతర కోర్సుల్లో శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. ఎందరికో ఆసరాగా నిలిచిన ఈ కేంద్రం.. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఎందుకూ కొరగాకుండా పోయింది. అయిదేళ్లుగా శిక్షణ లేక.. అక్కడ ఉన్న పరికరాలు సైతం దుమ్ముకొట్టుకుపోయాయి.

2019 వరకు...

టైలరింగ్‌, కుట్లు, అల్లికలు, కంప్యూటర్‌, మగ్గం వర్కు, జూట్‌ మిషన్‌ శిక్షణ, సబ్బులు, సర్ఫ్‌, శానిటరీ నాప్కిన్స్‌, ఫినాయిల్‌ తయారీ, బ్యూటీషియన్‌ కోర్సులపై పలువురికి శిక్షణ ఇచ్చారు. 2019 తర్వాత చేతి వృత్తులకు సంబంధించి శిక్షణలు నిలిపివేశారు. ప్రాంగణంలో శిక్షణ కేంద్రంతో పాటు అక్కడే వసతిగృహం, భోజనాలకు ప్రత్యేక భవనం ఉండగా.. అవి కూడా నిరుపయోగంగా మారాయి.

బడ్జెట్‌ లేకపోవడంతోనే..

బడ్జెట్‌ లేకపోవడంతో నెల్లూరులో శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వివిధ శాఖల కార్యక్రమాలకు భవనం అద్దెకు ఇస్తున్నాం.

మాధవి, మహిళా ప్రాంగణ జిల్లా మేనేజరు

గతమెంతో ఘనం

కావలి: పట్టణంలోని ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి విభాగంలో కుట్టుమిషన్లు నిరుపయోగంగా మారాయి. జగన్‌ ప్రభుత్వం వచ్చాక.. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో కొద్ది రోజులు కుట్టు, బేల్దారీలకు శిక్షణ ఇచ్చినా.. ప్రస్తుతం అవి కూడా నిలిచిపోయాయి. అధికారులను అడిగితే.. ఎన్నికల కారణంగా ఇవ్వడం లేదని చెప్పడం గమనార్హం.

ప్రభుత్వ సహకారం కొరవడి

ఆత్మకూరు: ఆత్మకూరులో శిక్షణలకు ఏపీపీసీ(ఆంధ్రప్రదేశ్‌ ప్రొడక్టవిటీ కౌన్సిల్‌) వేదికగా ఉండేది. తెదేపా ప్రభుత్వ హయాంలో కుట్టు, చీరలపై ప్రింటింగ్‌, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్‌ నైపుణ్యంలో తర్ఫీదు ఇచ్చేవారు. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందేలా చేసేవారు. వైకాపా ప్రభుత్వం వీటన్నింటినీ అటకెక్కించింది.

నాడు  300 మందికి  

దుత్తలూరు, కోవూరు : తెదేపా ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్‌, జడ్పీ నిధులతో దుత్తలూరు వెలుగు కార్యాలయంలో మూడు విడతలుగా మహిళలకు తర్ఫీదు ఇచ్చారు. ఒక్కో విడతకు వంద మంది చొప్పున.. మూడు విడతల్లో 300 మంది లబ్ధి పొందారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే ఈ కార్యక్రమాలు అటకెక్కాయి. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెంలో కూడా శిక్షణ కేంద్రం మూతపడింది

ఏదీ ఇవ్వడం లేదు...

గ్రామీణ యువతులు తమ కాళ్లపై నిలిచి ఆర్థిక ఉన్నతి సాధించేలా గతంలో శిక్షణ ఇచ్చేవారు. ఈ అయిదేళ్లలో అలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. దాంతో గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి పెంచుకునే అవకాశాలు లేకుండా పోయాయి.

శిరీష, ఆత్మకూరు

తెదేపా ప్రభుత్వంలోనే లబ్ధి

దుత్తలూరు వెలుగు కార్యాలయంలో కుట్టు శిక్షణ ఇస్తున్నారని తెలిసి 2018లో దరఖాస్తు చేశా. మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చారు. పూర్తికాగానే కుట్టు మిషన్‌ కొనుగోలు చేసి ఇంటి వద్దనే కుట్టు పని చేసుకుంటున్నా. కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకం  మహిళలకు లబ్ధి చేకూరింది.

మహబూబ్‌జానీ, దుత్తలూరు

బాబు హయాంలోనే నైపుణ్యం

గతంలో చంద్రబాబుహయాంలో మహిళలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసింది. యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ఎంతో అవసరం.

కుల్లూరు అశ్వని, కావలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని