logo

రైలులో భద్రతెంత?

‘రైలులో ప్రయాణించండి.. గమ్యస్థానాలకు సురక్షితంగా చేరండి’ అని రైల్వే అధికారులు చెప్పే మాటలపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది.

Published : 15 Aug 2023 03:17 IST

వరుస సంఘటనలతో ప్రయాణికుల్లో ఆందోళన
భద్రత పెంచాలని కోరుతున్న ప్రజలు

‘రైలులో ప్రయాణించండి.. గమ్యస్థానాలకు సురక్షితంగా చేరండి’ అని రైల్వే అధికారులు చెప్పే మాటలపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది. వరుస సంఘటనల నేపథ్యంలో ప్రయాణికుల్లో అభద్రతా భావం పెరుగుతోంది. రైలులో భద్రత కల్పించాల్సిన శాఖల్లో సిబ్బంది కొరత వేధిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది ప్రయాణించే రైలులో కనీస భద్రత కల్పించకపోవడమే దొంగలకు కలిసి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉలవపాడు, తెట్టు మధ్య రైలులో దోపిడీ జరిగిందనే మాట వినిపిస్తుండగా- దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

నెల్లూరు(నేర విభాగం), కావలి, బిట్రగుంట, న్యూస్‌టుడే

నెల్లూరు జిల్లా పరిధిలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు రైల్వే సిబ్బంది పనితీరుపై విమర్శలకు దారి తీస్తున్నాయి. గత నెల 30న ముసునూరు సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఇనుప ముక్క అడ్డుగా ఉంచి సంఘటన మరువక ముందే.. ఆదివారం అర్ధరాత్రి ఓ రైలులో దోపిడీకి పాల్పడటం.. మరో రైలులో దోపిడీకి యత్నించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైలులో సొమ్ములు పోగొట్టుకున్న ప్రయాణికులు కావలిలో ఫిర్యాదు చేసేందుకు యత్నించినా.. అక్కడి సిబ్బంది పట్టించుకోకపోవడం.. మీరు ఎక్కడ దిగుతారో.. అక్కడే కేసు పెట్టాలనీ సూచించడమూ బాధితులను ఆవేదనకు గురి చేసింది. సూళ్లూరుపేటలో ఓ మహిళ మొదట ఫిర్యాదు ఇవ్వగా.. నరేంద్రరెడ్డి అనే ప్రయాణికుడు తన భార్యకు చెందిన వంద గ్రాముల బంగారం పోయిందని ఫిర్యాదు చేశారు. మిగిలిన వారు చెన్నైలో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

వేధిస్తున్న సిబ్బంది కొరత

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిత్యం 120 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. గత పదేళ్లలో రైళ్లు, ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టు భద్రతా సిబ్బందిని పెంచకపోగా- ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాలనూ సక్రమంగా భర్తీ చేయలేదు. ఇదే నేరగాళ్లకు కలిసి వస్తోంది. రైల్వే ఆస్తుల పరిరక్షణకు ఆర్పీఎఫ్‌, ప్రయాణికుల భద్రతకు జీఆర్పీ పోలీసుశాఖలు ఉన్నా.. ఆ రెండింటిలోనూ దాదాపు 35 శాతం సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నెల్లూరు స్టేషన్‌ పరిధిలో 30 మంది ఉండాల్సి ఉండగా- 18 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. జీఆర్పీ పోలీసులకు రైలు నుంచి పడిన కేసులు, ఆత్మహత్య చేసుకున్న వారి మృతదేహాలు పోస్టుమార్టం చేయించడం.. వాటి దర్యాప్తుతోనే సరిపోతోంది. ఆ క్రమంలో ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

చిక్కా గ్యాంగ్‌ పనేనా.!

రైలును ప్రణాళిక ప్రకారం నిలిపి.. ప్రయాణికుల దగ్గరున్న సొమ్ములు కాజేయడంలో హరియాణకు చెందిన చిక్కా గ్యాంగ్‌ ఆరితేరింది. ఆ క్రమంలో ఇక్కడా చిక్కా గ్యాంగ్‌ పనే అయి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్కార్ట్‌ లేని రైలు.. రోడ్డు దగ్గర ఉన్న ప్రాంతం.. నిదానంగా వెళ్లే ప్రదేశాలను ముందుగానే గుర్తించి దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కొందరు రైలులోనే ఉండగా.. మరికొందరు క్షేత్రస్థాయిలో సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా రెక్కీ చేసి ఉలవపాడు-తెట్టు మధ్యలోని మలుపు దగ్గర అన్ని రైళ్లు కాస్త నిదానంగా వెళతాయని తెలుసుకున్నారా? అనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. 2014లో ఇదే ప్రాంతంలో దొంగతనం జరగ్గా.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే జరిగిందంటున్న పోలీసులు, అధికారులు.. రైలు, రోడ్డు మార్గాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

దొంగలను త్వరితంగా పట్టుకుంటాం

రైలులో చైన్‌ లాగి దొంగతనాలు చేయడంలో చిక్కా గ్యాంగ్‌ ఆరితేరింది. ఇది కూడా వారి పనేనని భావిస్తున్నాం. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నాం. చార్మినార్‌ రైలులోనూ దొంగతనం చేసేందుకు యత్నించారు. ఆ క్రమంలో రైలు నిలపాలని చూడగా మా సిబ్బంది అడ్డుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటాం.  

 మల్లికార్జునరావు, డీఎస్పీ, జీఆర్పీ, నెల్లూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని