logo

నిరుద్యోగికి నిరాశే..

నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్‌ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్‌ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది.

Published : 24 Apr 2024 04:25 IST

విద్యార్థుల నైపుణ్యానికి జగన్‌ శిక్ష..
యువతకు సాంకేతిక పరిజ్ఞానం దూరం
న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య), కందుకూరు పట్టణం

నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్‌ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్‌ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. కేంద్రం ద్వారా 2017 నుంచి 2019 వరకు 12 వేల మంది వివిధ టెక్నికల్‌ కోర్సుల్లో శిక్షణ పొందారు.


రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని మూయించి విద్యార్థులకు సీఎం జగన్‌ శిక్ష వేశారు. కేంద్రానికి తాళాలు వేయడంతో విలువైన పరికరాలు మూలకుచేరాయి. అయిదేళ్లుగా ఈ కేంద్రాన్ని నిర్వీర్యం చేయడంతో విద్యార్థులకు శిక్షణ అందకుండా పోయింది.


నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మూతబడిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం

నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రంలో జిల్లావ్యాప్తంగా పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇంటర్‌, పదో తరగతిలో చదువుతున్న పేద విద్యార్థులకు టెక్నికల్‌, వృత్తి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. జగన్‌ ప్రభుత్వం పేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణను దూరం చేసింది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఆయా టెక్నికల్‌ స్కిల్స్‌ పెంపొందించేందుకు రూ.వేలు ఖర్చు చేసి ప్రైవేట్‌గా శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది. పేద విద్యార్థులు డబ్బులు లేక ఉపాధి కోల్పోతున్నారు.
నిరుపయోగంగా విలువైన పరికరాలు.. పాలిటెక్నిక్‌ కళాశాలలో ఒక్కో ల్యాబ్‌ను రూ.15 లక్షలతో ఏర్పాటు చేశారు. ఇలా అయిదు ఉన్నాయి. కంప్యూటర్లు అందుబాటులోకి తెచ్చారు. అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి.


మూడేళ్లుగా మూత

కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్‌ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుచేశారు. విడతల వారీగా సుమారు 4వేలు మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో అనేకమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పొంది ఉన్నతస్థాయిలో ఉన్నారు. స్థానికంగా చిరు ఉద్యోగాలకు ఎంపికైన వారూ ఉన్నారు. ముఖ్యంగా ఆంగ్లం, సాఫ్ట్‌స్కిల్స్‌, వివిధ రకాల కంప్యూటర్‌ కోర్సులపై మంచి పట్టు సాధించారు. మూడేళ్ల నుంచి శిక్షణ నిలిపివేశారు. దీంతో యువత ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం సాధించేందుకు అవస్థలు పడుతున్నారు.


ప్రారంభించి.. మూసివేసి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రానికి తాళాలు వేసిన జగన్‌ ప్రభుత్వం.. తాజాగా నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రూ.70 లక్షలతో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో భవనాన్ని నిర్మించారు. కళాశాల ప్రాంగణంలో కేంద్రానికి సంబంధించి అయిదు ఎకరాలను వినియోగించుకునేలా అనుమతులు తీసుకున్నారు. లక్షలు వెచ్చించి హడావుడిగా భవనం ప్రారంభించిన అధికారులు ఇందులో శిక్షణ మరిచారు. కేంద్రానికి సైతం తాళాలు వేసి ఉంచారు.


వెంకన్నపురంలో అందని నైపుణ్య విద్య

కోవూరు, న్యూస్‌టుడే: కోవూరు మండలం వెంకన్నపురంలో గత తెదేపా ప్రభుత్వం యువత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గ్రామానికి చెందిన ఏపీఐసీ ఛైర్మన్‌ కృష్ణయ్య.. కేంద్రాన్ని తమ స్వగ్రామంలో ఏర్పాటు చేసి స్వయంగా కొంతకాలం పర్యవేక్షించారు. సొంత నిధులు వెచ్చించారు. నాడు యువతకు ఎంతో ఉపయోగపడిన కేంద్రానికి వైకాపా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో మూతపడింది. నియోజకవర్గంలో ఏటా సుమారు 5వేల మంది నిరుద్యోగులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు.


ప్రస్తుతం శిక్షణ ఇవ్వడంలేదు
సుధాకర్‌రావు పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌

కళాశాలలో ఉన్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం మూసి వేశారు. ప్రాంగణంలో ఉన్న అయిదు ఎకరాలను తీసుకొని అందులో భవనాన్ని ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రానికి నిర్మించారు. దీని ద్వారా విద్యార్థులకు శిక్షణ ప్రారంభించాల్సి ఉంది. ఇంకా ప్రారంభం కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని