logo

భవనాలు సరే.. బిల్లులేవి ఏలికా?

వైకాపా పాలకులు గొప్పగా ప్రచారం చేసుకునే గ్రామ సచివాలయ భవనాల పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. ప్రతి గ్రామానికి శాశ్వత సచివాలయ భవనం ఏర్పాటు చేసే బాధ్యత మాది అని చెప్పిన ముఖ్యమంత్రి..

Published : 05 May 2024 03:52 IST

ఇదీ జిల్లాలో సచివాలయాల పరిస్థితి
న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

పార్లపల్లెలో గోడలకే పరిమితమైన సచివాలయ భవనం

వైకాపా పాలకులు గొప్పగా ప్రచారం చేసుకునే గ్రామ సచివాలయ భవనాల పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. ప్రతి గ్రామానికి శాశ్వత సచివాలయ భవనం ఏర్పాటు చేసే బాధ్యత మాది అని చెప్పిన ముఖ్యమంత్రి.. ఆయన పాలన పూర్తి కావస్తున్నా నేటికీ భవనాలు పూర్తి చేయించ లేని పరిస్థితి. జిల్లా పరిషత్‌ పరిధిలో 46 మండలాల్లో సచివాలయ భవనాల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. పనులకు పాత బిల్లులు రాకపోవడంతో కొత్త పనుల ప్రారంభానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు.

సచివాలయ వ్యవస్థను బలోపేతం చేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వ్యవస్థకు సంబంధించిన భవన నిర్మాణాలను లక్ష్యం లోపు పూర్తి చేయలేని పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. రెండేళ్లుగా భవన నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం నెలకొంది. రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా స్థాయిలో పలుసార్లు సమీక్షలు నిర్వహిస్తున్నా.. భవన నిర్మాణం విషయంలో తీరు మారడం లేదు. బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో పాటు పలు సమస్యలు సవాల్‌గా నిలుస్తున్నాయి.

గడువులు పెంచుతూ..

సచివాలయ భవన నిర్మాణాల విషయంలో ఇప్పటికీ గడువులు మారుస్తున్నారు. ముందుగా పనులు రెండో విడత పేరుతో జడ్పీ సభ్యులకు అధికారులు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 31 నుంచి మళ్లీ కొత్త లక్ష్యం విధించారు. వీటి ప్రకారం 154 భవనాలు పూర్తి చేయడానికి రెండోవిడత పేరుతో మొదలు పెడతామని చెప్పారు. జడ్పీలో జరిగిన స్థాయి సంఘాల సమావేశంలో తిరిగి జడ్పీ ఇచ్చిన నివేదిక ప్రకారం... 154 భవనాలు మార్చి 31 తరువాత మొదలు పెడతామని తేదీలు మార్చేశారు. అవి కూడా ఎప్పటికి పూర్తి చేస్తారో నివేదిక పూర్వకంగా ప్రకటించలేదు. ఇందుకు కారణం అధికారులు ప్రోత్సహిస్తున్న గుత్తేదారులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇతర పనులకు సంబంధించిన పాత బిల్లులు రాకపోవడంతో కొత్త పనులు మొదలు పెట్టటానికి ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు ఇరకాటంలో పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 40 శాతం భవనాల పనులు వేగం కాని పరిస్థితి ఉంది.

మాట మార్చిన అధికారులు

జిల్లా విభజనకు ముందు 659 సచివాలయ భవనాలు మంజూరు అయ్యాయి. ఇందుకు రూ.250.76 కోట్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పనులు జిల్లా పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో మొదలయ్యాయి. కరోనా వెంటాడడం, కూలీలు చిక్కకపోవడం, బిల్లులు వేగంగా రాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. సచివాలయ వ్యవస్థ ప్రారంభించి వచ్చే అక్టోబరు నాటికి నాలుగో సంవత్సరం. ఇప్పటికీ కొత్త భవనాలు లేక అద్దె వాటిల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో పంచాయతీ భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేశారు.

మంజూరైన మొత్తం భవనాలు : 659
పూర్తయినవి: 342
వివిధ దశల్లో ఉన్నవి: 163
కొత్తగా ఎంచుకున్న లక్ష్యం: 154

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని