logo

ఊకదంపుడు ఉపన్యాసం.. వైకాపా శ్రేణుల్లో నిరుత్సాహం

కలెక్టరేట్‌, విద్య, జడ్పీ, నేరవిభాగం, న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ కూడలిలో శనివారం నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభ చప్పగా సాగింది.

Published : 05 May 2024 03:58 IST

నెల్లూరుకు హామీలు ఇవ్వకనే ముగిసిన జగన్‌ ప్రచారం
ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే వెనక్కు మళ్లిన ప్రజలు
దుకాణాలు మూసి, బారికేడ్ల ఏర్పాటుతో సామాన్యులకు ఇక్కట్లు

మాట్లాడుతున్న జగన్‌ మోహన్‌ రెడ్డి, అభివాదం చేస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పక్కన ప్రసన్నకుమార్‌ రెడ్డి

ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్‌, విద్య, జడ్పీ, నేరవిభాగం, న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ కూడలిలో శనివారం నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభ చప్పగా సాగింది. సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్‌ పనులు, నెల్లూరు నగరంలో ఆగిపోయిన భూగర్భ డ్రైనేజీ, పెన్నా పొర్లుకట్టల బలోపేతం, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం తదితరాలపై మాట్లాడుతారనుకుంటే.. వాటిని వదిలేసి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, తెదేపా సూపర్‌-6 పథకాలపై విమర్శలు గుప్పించడంతో.. ప్రజలు అటుంచి, వైకాపా కార్యకర్తలు, అభిమానులే డీలా పడ్డారు. ఇటీవల జరిగిన కందుకూరు సభ కూడా తుస్సు మనడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు.

మండుటెండలో మజ్జిగ ప్యాకెట్లకోసం ప్రజల అవస్థలు

మండుటెండలో నరకం

ఓ వైపు సూరీడు భగభగలు.. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభ ప్రజలకు నరకం చూపించింది. మండుటెండలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సభా ప్రాంతంలో కనీసం మంచినీరు కూడా అందించలేదు. ఉదయం 11 గంటల నుంచే పోలీసులు ఆంక్షలు విధించడంతో జన జీవనం స్తంభించింది. ముఖ్యమంత్రి 45 నిమిషాల ప్రసంగం కోసం నగరవాసులకు ఏడు గంటలు నరకం చూపించారు. అసలే గంట ఆలస్యంగా సభ ప్రారంభం కావడం.. దానికి తోడు ఊకదంపుడు ఉపన్యాసంతో జనం జారుకున్నారు. జగన్‌ ప్రసంగం మొదలుపెట్టిన అయిదు నిమిషాలకే పలువురు ప్రాంగణం నుంచి వెనుదిరిగారు.

నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు..

సీఎం ప్రసంగం వద్ద పలుచగా జనం


బలవంతంగా దుకాణాల మూత

పెట్రోల్‌ బంకును మూసి.. బారికేడ్ల ఏర్పాటు

వీఆర్సీ క్రీడా మైదానంలో హెలికాప్టర్‌ దిగిన జగన్‌ కోసం.. అక్కడి నుంచి గాంధీబొమ్మ సెంటర్‌లోని సభా ప్రాంగణం వరకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు పెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం 4.30కి రాగా.. ఉదయం నుంచే పోలీసులు దుకాణాలు మూయించి.. బారికేడ్లు అడ్డుగా పెట్టారు. సభా ప్రాంగణానికి రెండు కి.మీ. దూరంలోని ఫత్తేఖాన్‌పేట రైతు బజారు నుంచే వాహనాలను దారి మళ్లించారు. మరోవైపు బోసుబొమ్మ వద్ద నుంచి వాహనాలను మళ్లించడంతో.. ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు.


తరలించిన జనం.. తుర్రుమన్నారు

సీఎం ప్రసంగిస్తుండగానే.. వెనుదిరిగిన ప్రజలు

జగన్‌ కార్యక్రమానికి జనాన్ని తరలించేందుకు వైకాపా నాయకులు అష్టకష్టాలు పడ్డారు. ముఖ్యమంత్రి వచ్చే వరకు సభా ప్రాంగణం వెలవెలబోయింది. వైకాపా జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రాంగణానికి దూరంగా ఉన్న ప్రజల వద్దకు వెళ్లి.. అందరూ రావాలని కోరారు. 54 డివిజన్లకు రూ.54 లక్షలు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. నెల్లూరు గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరికి రూ.300, మద్యం సీసా ఇచ్చి ఆటోల్లో తీసుకొచ్చినట్లు అక్కడికి వచ్చిన వారే చెప్పడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకే అక్కడకు వచ్చిన జనం.. ఎండలో నిల్చోలేక దుకాణల ముందు సేదతీరారు. అన్ని దుకాణాలు మూసినా.. ట్రంకు రోడ్డులోని మద్యం దుకాణం మాత్రం మూయలేదు. దీంతో సభకు వచ్చిన చాలా మంది.. అక్కడే మద్యం కొనుగోలు చేసి, రోడ్డుపైనే తాగడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని