logo

పాలకా.. ఏదీ బృహత్‌ ప్రణాళిక?

ఏళ్ల తరబడి నుంచి పట్టణ ప్రజలు ఎదురుచూస్తోన్న కందుకూరు మాస్టర్‌ప్లాన్‌ (బృహత్‌ ప్రణాళిక)కు మోక్షం లభించడం లేదు. నూతన ప్రణాళిక కోసం ఆరేళ్ల క్రితం అడుగులు పడగా.. నేటికీ ఖరారు కాకపోవడం ప్రజల్ని విస్తు గొలుపుతోంది.

Published : 05 May 2024 04:00 IST

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: ఏళ్ల తరబడి నుంచి పట్టణ ప్రజలు ఎదురుచూస్తోన్న కందుకూరు మాస్టర్‌ప్లాన్‌ (బృహత్‌ ప్రణాళిక)కు మోక్షం లభించడం లేదు. నూతన ప్రణాళిక కోసం ఆరేళ్ల క్రితం అడుగులు పడగా.. నేటికీ ఖరారు కాకపోవడం ప్రజల్ని విస్తు గొలుపుతోంది. అనేక తర్జన భర్జనల అనంతరం డ్రాఫ్ట్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుని అనుమతులు కోసం డీటీసీపీకి పంపగా.. అక్కడ ఎటువంటి కదలిక లేదని సమాచారం. దీంతో పట్టణవాసుల ఆశలు అడియాసలుగా మిగిలిపోతున్నాయి.

2022 అక్టోబర్‌లో డ్రాఫ్ట్‌ ప్లాన్‌

1987 వరకు పంచాయతీగా ఉన్న కందుకూరును నగర పంచాయతీగా అభివృద్ధి చేసేందుకు అప్పట్లో కొన్ని చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేశారు. 2001లో గ్రేడ్‌-2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఈ మేరకు పట్టణానికి అవసరమైన మాస్టర్‌ప్లాన్‌ను తొలిసారి 2005లో తయారుచేశారు. నాటి నుంచి నేటి వరకు అదే అమలులో ఉంది. దీంతో పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి సమస్య ఎదురవుతోంది. ముఖ్యంగా తానికొండకొష్టాలు, పామూరురోడ్డు, కేసరగుంటకాలనీ, కనిగిరిరోడ్డు, జీవీఆర్‌.నగర్‌ ప్రాంతాలవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఎట్టకేలకు 2018లో నూతన మాస్టర్‌ప్లాన్‌ ఏర్పాటుకు అడుగులు వేశారు. అనేక రకాలుగా కసరత్తు చేసి 2022 అక్టోబరులో డ్రాఫ్ట్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. ప్రకటించిన డ్రాఫ్ట్‌ ప్లాన్‌పై నెల రోజుల్లోగా అభ్యంతరాలుంటే ప్రజలు రాతపూర్వకంగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు 19మంది అభ్యంతరాలు తెలపడంతో తదనుగుణంగా మార్పులు, చేర్పులు చేసిన కందుకూరు మున్సిపల్‌ అధికారులు.. తుది డ్రాఫ్ట్‌ అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపేందుకుగాను నుడాకు పంపారు. ఏడాది క్రితం నుడా అధికారులు కందుకూరు వచ్చి క్షేత్రపరిశీలన కూడా చేసి వెళ్లారు. దీంతో అతి త్వరలోనే తుది మాస్టర్‌ప్లాన్‌ ఖరారు అవుతుందని అంతా భావించారు.

డీటీసీపీ అనుమతులు రావాలి

కందుకూరు పట్టణానికి సంబంధించిన నూతన మాస్టర్‌ప్లాన్‌ కసరత్తు మొత్తం ఒడా(ఒంగోలు) పరిధిలో జరిగింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కందుకూరు నెల్లూరులో కలిసినందున నుడా(నెల్లూరు) పరిధిలోకి వెళ్లింది. ఇలాంటి సాంకేతిక సమస్యలతో కొన్ని నెలలు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం వచ్చిన ఆదేశాల మేరకు నుడా అధికారులు ప్రక్రియ తిరిగి ప్రారంభించారు. తుది ప్రకటన కోసం డీటీసీపీకి పంపగా.. కొన్ని మార్పులు, చేర్పులు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు మున్సిపల్‌, నుడా అధికారులు సవరణలు చేసి సదరు నివేదికలను డీటీసీపీ అనుమతులు కోసం పంపారు. ఈ ప్రక్రియ పూర్తై ఆర్నెల్లు దాటింది. కానీ, అడుగు ముందుకు పడలేదు. దీంతో అనేకమంది పారిశ్రామికజోన్‌, గ్రీన్‌జోన్‌, నీటివనరుల జోన్‌ వంటి సమస్యలు పరిష్కారంగాక ఇబ్బందులు పడుతున్నారు.


అనుమతులు రావడం లేదు

మాకు పామూరురోడ్డులో ఇంటి స్థలం ఉంది. ఇల్లు కట్టుకుందామనుకుంటే.. సదరు స్థలం పారిశ్రామికజోన్‌లో ఉంది. ఇంటి ప్లాన్‌ అనుమతులు రావని చెబుతున్నారు. సమస్య పరిష్కారం కోసం అనేకసార్లు అర్జీలు ఇచ్చాం. దాదాపు 5ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. నేటికీ పరిష్కారం కాలేదు. 

ఎం.రమణయ్య, పామూరురోడ్డు


త్వరలోనే వస్తాయి

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తుది మాస్టర్‌ప్లాన్‌ కోసం చేసిన మార్పులు, చేర్పులను సవరణలు చేసి డీటీసీపీ అనుమతుల కోసం పంపాం. త్వరలోనే అనుమతులు వస్తాయి.

శ్రీనివాసులు, పట్టణ ప్రణాళికాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని