logo

ఒక్కరితో బోధనెలా మామయ్యా!

కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.

Published : 06 May 2024 05:54 IST

విద్యకు భరోసా ఇవ్వని ప్రభుత్వం
జిల్లాలో 924 ఏకోపాధ్యాయ పాఠశాలలు

  • కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.
  • జమ్మిపాళెంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 21 మందిచదువుతున్నారు. ఇక్కడా ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నారు.

న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో వైకాపా ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు చాలనే సీఎం జగన్‌ ధోరణి విద్యా వ్యవస్థను తుంగలో తొక్కేలా ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో జీవో 117 తెచ్చి పాఠశాలలను విలీనం చేయడంతో స్థానికంగా ప్రాథమిక విద్య అందని ద్రాక్షగా మారిందంటున్నారు. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందదనే భావన వ్యక్తమవుతోంది. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు అవసరమని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వీటిని వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రాథమిక స్థాయిలో పాఠశాలకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడిని నియమించి చేతులు దులుపుకొంటోంది. ఆయా పాఠశాలల్లో తరగతులు ఎన్ని ఉన్నా.. ఒకరే అన్నీ తానై బోధన చేయాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని సబ్జెక్టులు బోధిస్తూ అలసి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏకోపాధ్యాయ బడిలో ఏదైనా అత్యవసరమై సెలవు పెట్టాల్సి వస్తే సమీప పాఠశాలల నుంచి మరో మాస్టారుని పంపాల్సి వస్తోంది. ఖాళీ పోస్టులు భర్తీ కాక ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది.

కుంటుపడుతున్న బోధన

విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నా...క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక బోధన కుంటుపడుతోంది. చాలా బడుల్లో ఒక్కరే ఉన్నారు. ఈ ఒక్కరికీ బోధనేతర పనులతోనే సరిపోతోంది. ఇది విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో 924 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కరు చొప్పున ఉపాధ్యాయులున్నారు. సింగిల్‌ టీచర్స్‌ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు అత్యవసరంగా సెలవు పెట్టాలంటే కష్టతరం అవుతోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సెలవు పెడుతున్న ఉపాధ్యాయుల స్థానంలో బోధనకు క్లస్టర్‌ రీసోర్స్‌ మానిటరింగ్‌ టీచర్స్‌ (సీఆర్‌ఎంటీ), పలువురు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమిస్తున్నారు.


ఉపాధ్యాయులపై ఒత్తిడి

ఉన్న ఒక్క ఉపాధ్యాయుడిపై ఒత్తిడి ఎక్కువవుతోంది. పలురకాల యూప్‌ల్లోకి సమాచారం అప్‌లోడ్‌ చేయాలి. ఒకవేళ నాడు- నేడు కార్యక్రమంలో పనులు చేస్తుంటే వాటిని పర్యవేక్షించాలి. ఉదయాన్నే మరుగుదొడ్లను ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. విద్యార్థుల హాజరు వివరాలు ఉదయం పది గంటల్లోపు ఇవ్వకపోతే ఆ ప్రభావం మధ్యాహ్న భోజన పథకంపై పడుతోంది. నాడు- నేడుకు ఎంపికైతే పనుల వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. సచివాలయ సిబ్బంది పర్యవేక్షించి సీఆర్‌యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు.ఈ యాప్‌ సాంకేతిక సమస్యతో ఉపాధ్యాయులకు అదనపు భారం అవుతోంది. రాష్ట్రస్థాయి యాప్‌లకు తోడు జిల్లాస్థాయిలో మరికొన్ని యాప్‌ల్లో వివరాలు అప్‌లోడ్‌ చేయాలి.


పాఠశాలల్లో పిల్లల్ని చేర్చడం లేదు
రమేష్‌, బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల బోధన కుంటు పడుతోంది. ఈ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని